అభివృద్ధి పథంలో బిహార్ (Bihar) ముందుకు సాగాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) అన్నారు. అందువల్ల బిహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలను చేపడుతామని కేంద్రాన్ని నితీశ్ కుమార్ హెచ్చరించారు.
ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…. రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగేందుకు ప్రత్యేక హోదా అవసరమని పేర్కొన్నారు. తమ డిమాండ్ కు మద్ధతు ఇవ్వని వారిని అభివృద్ధి వ్యతిరేకులుగా పరిగణిస్తామని చెప్పారు. కేంద్రం త్వరగా స్పందించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
తమ డిమాండ్‌ను కేంద్రం పరిష్కరించక పోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తామన్నారు. సమాజంలో వెనుకబడిన తరగతుల వారి కోసం సంక్షేమ పథకాలు అమలు చేయాలని తాము అనుకుంటున్నట్టు చెప్పారు. ఆ పథకాల అమలు కోసం బిహార్ లాంటి పేద రాష్ట్రాలకు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుందన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తే ఆ మొత్తాన్ని కేవలం రెండున్నరేండ్లలోనే ప్రజలకు అందిస్తామని వెల్లడించారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో అణగారిన కులాల కోటాను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును శాసన సభ ఆమోదించిందన్నారు. కులాల సర్వే ఆధారంగా మొత్తం రిజర్వేషన్లను 75 శాతానికి పెంచామన్నారు.