ఆర్టికల్ 370 రద్దు ( Abrogation Of Article 370)ను సమర్థిస్తూ సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) ఇచ్చిన తీర్పుపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS)కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు జాతీయ సమైక్యతను మరింత బలోపేతం చేస్తుందని తెలిపింది. ఆర్టికల్ 370ని ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోందని సంఘ్ పబ్లిసిటీ చీఫ్ సునీల్ అంబేకర్ వెల్లడించారు.
ఆర్టికల్ 370 రద్దుకు సుప్రీంకోర్టు చట్టబద్ధత కల్పించడం స్వాగతించదగిన విషయమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆర్ఎస్ఎస్ స్వాగతిస్తోందని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ కూడా ఈ విషయంలో అనేక తీర్మానాలు చేసిందని గుర్తు చేశారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే నిబంధనను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గతంలో పలు ఉద్యమాల్లో ఆర్ఎస్ఎస్ పాల్గొందన్నారు.
సుప్రీం కోర్టు నిర్ణయం జాతీయ సమైక్యతను బలోపేతం చేస్తుందన్నారు. ఆర్టికల్ 370 కారణంగా జమ్మూ కశ్మీర్‌లో ఏండ్ల తరబడి అన్యాయానికి గురవుతున్న ప్రజలకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగిస్తుందని వివరించారు. మరోవైపు ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ మహిళా సంస్థ సంవర్ధినీ న్యాస్ కూడా సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసింది.
ఆర్టికల్ 370ని రద్దు అనేది జమ్మూ కశ్మీర్‌ను భారత్‌లోని ప్రధాన స్రవంతిలో విలీనం చేసేందుకు బాటలు వేసిందని తెలిపింది. పౌరులందరికీ సమాన హక్కులు, అవకాశాలను పెంపొందించడం కోసం మార్గం సుగమం చేసిందని పేర్కొంది. ఆర్టికల్ 370 రద్దుకు అనుకూలంగా తీర్పు ఇచ్చినందుకు సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు చెప్పింది.