తెలంగాణ (Telangana) పై ప్రధాని మోడీ (PM modi) వరాల జల్లు కురిపించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించిన ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ప్రజాగర్జన సభలో పాల్గొని తెలంగాణకు పలు వరాలు ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్బంగా ప్రధాని మోడీ వెల్లడించారు.
ములుగు జిల్లాలో సమ్మక్క-సారక్క సెంట్రల్ ట్రైబల్ వర్శిటీ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. రూ. 900 కోట్లతో ఈ వర్శిటీని ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ గా పిలవాలన్నారు. ప్రజా గర్జన సభలో ఆయన మాట్లాడుతూ…. తన కుటుంబ సభ్యులు సంతోషంగా వున్నారని తెలుగులో ప్రసంగించారు.
తెలంగాణలో పసుపు రైతుల కోసం జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ జాతీయ పసుపు బోర్డు రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. తెలంగాణ ఫ్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు బీజేపీ సర్కార్ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
దేశంలో ఐదు టెక్స్ టైల్స్ పార్కుల్లో ఒకటి తెలంగాణకు కేటాయించామన్నారు. హన్మకొండలో నిర్మించబోయే టెక్స్ టైల్స్ పార్కుతో వరంగల్, ఖమ్మం జిల్లాల ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. 2014 వరకు తెలంగాణలో వున్న రహదారుల పొడవు 2500 కిలో మీటర్లు మాత్రమేనన్నారు. ఈ తొమ్మిదేండ్లలో 2500 కిలో మీటర్ల రహదారులు నిర్మించామన్నారు.