పార్లమెంట్ శీతాకాల సమావేశాల(Parliament Winter session)ను డిసెంబర్ 4 నుంచి 22 వరకు నిర్వహించనున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో డిసెంబర్ 2న అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి (Prahlad Joshi) తెలిపారు. వాస్తవానికి డిసెంబర్ 3న అఖిల పక్ష సమావేశం జరగాల్సి ఉంది.
కానీ డిసెంబర్-3న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో సమావేశాన్ని ఒక రోజు ముందుకు తీసుకు వచ్చారు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై వచ్చిన ‘ప్రశ్నలకు లంచం’ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ తన నివేదికను ఈ సమావేశాల్లో లోక్ సభకు అందించనుంది.
ప్యానెల్ సిఫార్సు చేసిన బహిష్కరణ అమలులోకి రాకముందే సభ ఆ నివేదికను ఆమోదించాల్సి ఉంటుంది. మరోవైపు ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ ల స్థానాల్లో తీసుకు రానున్న మూడు బిల్లులను ఈ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పటికే ఈ మూడు బిల్లులకు హోం శాఖ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.
ఇక భారత ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్ల నియామక ప్రక్రియకు సంబంధించిన బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టనున్నారు. వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశ పెట్టినప్పటికీ ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కారణంగా ఈ బిల్లుకి ఆమోదం లభించలేదు.