ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) లోని హాపూర్‌లో గర్భిణికి తల్లి, సోదరుడు పెట్రోల్ (Petrol) పోసి నిప్పంటించారు. దాదాపు 70 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రి (Hospital) లో చేరిన ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఉత్తర్ ప్రదేశ్ లోని హాపూర్ జిల్లాలో చోటుచేసుకుందీ ఘటన.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉత్తర్ ప్రదేశ్ లోని నవాడ ఖుర్ద్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల అవివాహిత మహిళ అదే గ్రామానికి చెందిన యువకుడితో శారీరక సంబంధం పెట్టుకుంది. దీంతో ఆమె గర్భవతి అయ్యింది. విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు ఆగ్రహానికి లోనయ్యారు. ఎలాగైనా చంపేయాలన్న ఉద్దేశంతో ఆమె మీద పెట్రోల్ పోసి సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు.
గురువారం ఉదయం ఆ మహిళ తల్లి, సోదరుడు ఆమెను సమీపంలోని అడవికి తీసుకెళ్లారు. అక్కడే ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటల్లో తీవ్రంగా గాయపడిన బాధితురాలు అరుపులూ కేకలూ వేయడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు, కాలిపోతున్న ఆ అమ్మాయిని హాస్పటల్ కి తీసుకెళ్లారు. అప్పటికే 70 శాతానికి పైగా కాలిపోయిందనీ, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలి తల్లి, సోదరుడిపై కేసు నమోదు చేశారు.
బాలిక తల్లి, సోదరుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని, ఈ విషయంపై దర్యాప్తు కొనసాగుతోందని హాపూర్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజ్‌కుమార్ అగర్వాల్ తెలిపారు.