– చట్టరూపం దాల్చిన మహిళా బిల్లు
– రాష్ట్రపతి ముర్ము ఆమోదం
– గెజిట్ నోటిఫికేషన్ విడుదల
– ఇకపై చట్ట సభల్లో మహిళలకు..
– 33 శాతం రిజర్వేషన్లు
మహిళా రిజర్వేషన్ బిల్లు (Woman Reservation Bill) కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఆమోద ముద్ర వేశారు. ఇటీవల పార్లమెంట్ ఉభయ సభలు ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి. తాజాగా రాష్ట్రపతి ఆమోదం కూడా లభించడంతో బిల్లు చట్టంగా మారింది.
మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారినట్టు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నూతన చట్టం ద్వారా మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ లభించనుంది. అంతకుముందు, 128వ రాజ్యాంగ సవరణ బిల్లుపై భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ కర్ సంతకం చేశారు.
అనంతరం రాజ్యాంగంలోని 111వ నిబంధన ప్రకారం బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. తాజాగా ఆ బిల్లును పరిశీలించి రాష్ట్రపతి కూడా ఆమోదం తెలిపారు. నారి శక్తి వందన్ అదినీయమ్ బిల్లును ఈ నెల 20న లోక్ సభ ఆమోదించింది. మొత్తం 454 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు.
కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే బిల్లుపై వ్యతిరేకత తెలిపారు. ఓబీసీ మహిళలు, మైనార్టీలకు సబ్ కోటా లేనందున ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు ఎంఐఎం ఎంపీలు వెల్లడించారు. ఇక ఈ నెల 21న బిల్లును రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇది చట్టంగా మారినప్పటికీ అమలుకు మరింత సమయం పట్టనుంది.
జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మహిళా రిజర్వేషన్లను అమలు చేయనున్నట్టు ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బిల్లుపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది బీజేపీ జుమ్లా బిల్లు అని ఫైర్ అయ్యారు.