ఉత్తరాఖండ్‌లో ఉత్తర కాశి సిల్క్యారా టన్నెల్ (Tunnel)లో చిక్కుకున్న 41 మంది కార్మికులను అధికారులు నిన్న సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. 17రోజుల పాటు రెస్క్యూ సిబ్బంది (Rescue Team) అనేక విధాలుగా ప్రయత్నించి కార్మికులను కాపాడింది. దీంతో రెస్క్యూ సిబ్బందిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా రెస్క్యూ సిబ్బందిని ఆస్ట్రేలియా ప్రధాని అంటోని అల్బెన్స్ ప్రశంసించారు.
భారత అధికారులు అద్భుతమైన విజయాన్ని సాధించారని కొనియాడారు. రెస్క్యూ ఆపరేషన్‌లో ఆస్ట్రేలియన్ ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ కూడా కీలక పాత్ర పోషించడం తమకు చాలా గర్వకారణంగా ఉందని అన్నారు. భారత్‌లో ఆస్ట్రేలియా హై కమిషనర్ పిలిప్ గ్రీన్ చేసిన ట్వీట్ ను ప్రధాని అంటోని అల్బెన్స్ రీ ట్వీట్ చేశారు.
అంతకు ముందు ఇది ఒక గొప్ప విజయమని పిలిప్ గ్రీన్ తెలిపారు. ఉత్తర్‌ఖండ్ సొరంగంలో చిక్కుకున్న మొత్తం 41 మంది కార్మికులను విజయవంతంగా బయటకు తీసుకు వచ్చినందుకు భారత అధికారులకు అభినందనలు తెలిపారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో సాంకేతిక సహాయాన్ని అందించిన ఆస్ట్రేలియా ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్‌కు ప్రత్యేక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.
అంతకు ముందు రెస్క్యూ సిబ్బందిని ప్రధాని మోడీ అభినందించారు. కార్మికులకు రెస్క్యూ సిబ్బంది ఒక కొత్త జీవితాన్ని అందించారని తెలిపారు. రెస్క్యూ సిబ్బంది ప్రయత్నాలు మానవతకు, టీమ్ వర్క్‌కు ఒక మంచి ఉదాహరణగా నిలిచాయని కొనియాడారు. రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమై సొరంగం నుంచి కార్మికులు సురక్షితంగా బయటపడటంతో దేశ మొత్తం ఉద్వేగానికి గురైందన్నారు.