ఉత్తరాఖండ్ (Uttarakhand)లో సిల్క్యారా సొరంగం (Tunnel) కూలి ఇప్పటికి ఎనిమిది రోజులు అవుతోంది. సొరంగంలో చిక్కుకున్న 41 మందిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సుమారు 200 గంటలకు పైగా కార్మికులు సొరంగంలోనే చిక్కుకుని ఉండటంతో వారి ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు రెస్క్యూ ఆపరేషన్ కోసం అమెరికా నుంచి ఆగర్ యంత్రాన్ని ప్రత్యేకంగా తీసుకు వచ్చారు.
తాజాగా కార్మికులను రక్షించేందుకు అధికారులు మరో ఆలోచన చేశారు. కొండపై నుంచి ఆ టన్నెల్ కు సమాంతరంగా మరో రంధ్రం చేయాలని, దాని నుంచి కార్మికులను బయటకు తీసుకు రావాలని అధికారులు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిన్న మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నుంచి హై పర్ఫామెన్స్ డ్రిల్లింగ్ మెషిన్ ను టన్నెల్ వద్దకు తీసుకు వచ్చారు.
డ్రిల్లింగ్ మెషిన్ వచ్చిన వెంటనే నిన్నటి నుంచి రంధ్రం తవ్వకాన్ని మొదలు పెట్టారు. ఇది ఇలా వుంటే రెస్క్యూ ఆపరేషన్ ను ప్రధాన మంత్రి కార్యాలయం (PMO)పర్య వేక్షించనుంది. టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను రక్షించే విషయంలో కేంద్రం కట్టుబడి ఉందని పీఎంఓ నిన్న ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. దీంతో రెస్క్యూ ఆపరేషన్ ను మరింత ముమ్మరం చేయనున్నారు.
కార్మికులను రక్షించేందుకు అటు పీఎంవో అధికారులు, ఇటు రాష్ట్ర అధికారులు కలిసి ఐదు ప్రణాళికలు రచించారు. కేవలం ఒక మార్గంలో ప్రయత్నించడం కన్నా ఐదు మార్గాల్లో ప్రయత్నించడం మేలు అని నిపుణులు సూచించారని ప్రధాని మాజీ సలహాదారుడు భాస్కర్ కుల్బే వెల్లడించారు. వీలైనంత త్వరగా వారిని బయటకు తీసుకు రావాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు.