భారతదేశం (India) సహజంగా లౌకిక తత్వం (Secularism)పై ఆధారపడి ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) అన్నారు. అందువల్ల సెక్యులరిజం గురించి భారత్ కు ప్రపంచం పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. భారత్ అన్ని మతాలను గౌరవిస్తుందన్నారు. భారత్ తన సొంత బలాల ఆధారంగా అభివృద్ధి నమూనాను అవలంభించాల్సిన అవసరం ఉందన్నారు.
యూపీలోని గ్రేటర్ నోయిడాలోని శారదా యూనివర్శిటీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి సమతుల్య విధానాన్ని అనుసరించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు పాలనా వ్యవస్థలో సంస్కరణలు అవసరమని అన్నారు.
1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన రాజ్యాంగంలో సెక్యులరిజాన్ని ప్రవేశపెట్టామన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని భారత్ విశ్వసిస్తుందన్నారు. అందరి క్షేమం కోసం భారత్ ఎప్పుడూ ప్రార్థిస్తుందన్నారు. భారత్ హూనా, కుషాన్, ఇస్లాం మతాలను కూడా ఆహ్వానించిందని గుర్తు చేశారు.
వాతావరణం, ఆహారం లేదా ఆధ్యాత్మిక శ్రేయస్సు వంటి ఏవైనా సమస్యలు మనకు లేవన్నారు. అందుకే, ఇక్కడ ఆశ్రయం పొందాలనుకునే వారందరికీ తాము సంతోషంగా వసతి కల్పించామన్నారు. హిందూ మతం మనకు ఇదే విషయాన్ని బోధిస్తుందన్నారు. అందుకే దీనని స్వాగతించామన్నారు.
భారతదేశ సంస్కృతి, యోగా సంప్రదాయం ప్రపంచంలోనే పురాతనమైనవన్నారు. గతంలో యోగాను విస్మరించారని తెలిపారు. ఒకప్పుడు యోగాను బ్లాక్ మ్యాజిక్ అని పిలిచేవారని అన్నారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం దాన్ని ఆమోదిస్తోందని తెలిపారు. కొవిడ్-19 సమయంలో ఆయుర్వేదం చాలా మందికి సహాయపడిందని పేర్కొన్నారు. ఎంతో మందికి కరోనాను నయం చేసిందన్నారు.