ఇజ్రాయెల్ (Israel) –హమాస్ యుద్ధంలో నిన్నటి దాకా ఇజ్రాయెల్ కు మద్దతు తెలుపుతూ వస్తన్న అమెరికా (USA) ఇప్పుడు స్వరం మార్చింది. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఇజ్రాయెల్ ను జోబైడెన్ హెచ్చరించారు. గాజాను ఆక్రమించాలన్న ఇజ్రాయెల్ ఆలోచనను ఆయన తప్పుబట్టారు. గాజా ఆక్రమణ అనేది అతి పెద్ద తప్పు అవుతుందని ఆయన హెచ్చరించారు.
గాజాలో జరిగిన విషయాన్ని తన కోణంలో చెప్పాలంటే…. హమాస్, ఇతర తీవ్రవాదులు పాలస్తీనా మొత్తానికి ప్రాతినిథ్యం వహించడం లేదన్నారు. అందువల్ల గాజాను ఆక్రమించాలని ఇజ్రాయెల్ చూడటం అతి పెద్ద తప్పే అవుతుందని ఆయన అన్నారు. కానీ ఆ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదులను తప్పకుండా ఏరి వేయాల్సిందేనని పేర్కొన్నారు.
మరోవైపు ఇజ్రాయెల్‌లో పర్యటించాలని అమెరికా అధ్యక్షుడు నిర్ణయించినట్టు వైట్ హౌస్ సీనియర అధికారి ఒకరు తెలిపారు. కానీ ఇప్పటి వరకు పర్యటనకు సంబంధించి ఎలాంటి షెడ్యూల్ ఖరారు కాలేదని చెప్పారు. ఇజ్రాయెల్ కు మద్దతుగా తమ దేశంలో పర్యటించాలని ఆ దేశ ప్రధాని పంపిన ఆహ్వానం మేరకు బైడెన్ ఆలోచనలు చేస్తున్నారని అన్నారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య వార్ నేపథ్యంలో ఇప్పటి వరకూ మొత్తం 1400 మందికిపైగా మరణించారు. అందులో 30 మంది అమెరికన్ పౌరులు ఉండటం గమనార్హం. ఇది ఇలా వుంటే తమ దేశానికి చెందిన సుమారు 200 మంది హమాస్ చేతిలో బందీగా ఉన్నట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ యుద్దంలో ఇప్పటికే అమెరికా సైన్యం పాల్గొంటోందని ఇరాన్ ఆరోపించింది.
ఇక లెబనాన్ ఉత్తర సరిహద్దుల వద్ద ఉన్న ప్రజలను ఖాళీ చేయిస్తున్నట్టు ఇజ్రాయెల్ సైన్యాలు తెలిపాయి. లెబనాన్-ఇజ్రాయెల్ సరిహద్దుల్లో హిజ్బుల్లా దాడులకు ఇరాన్ ఆదేశించిందని ఇజ్రాయెల్ ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో లెబనాన్ సరిహద్దుల్లో తాము దాడులు చేస్తున్నామని పేర్కొన్నాయి. ఇది ఇలా వుంటే గాజాలో ఇప్పటి వరకు ఒక మిలియన్ మంది నిరాశ్రయులైనట్టు ఐరాస వెల్లడించింది.