తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి(Yadadri) శ్రీలక్ష్మీ నరసింహ స్వామి(Sri Laxmi Narasimha Swami) వారి ఆలయ సన్నిధిలో ధనుర్మాస ఉత్సవాలు (Dhanurmasam Utsavalu) కనుల పండువగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఆలయంలో 30 రోజుల పాటు జరగనున్నాయి.
వేడుకల్లో భాగంగా నెలరోజులు సూర్యోదయానికి ముందే గోదా దేవి వ్రతపర్వం, మార్గళి, పాశురాల పఠనం నిర్వహిస్తారు. మొదటి రోజు అమ్మవారికి తిరుప్పావై కార్యక్రమం మంగళ వాద్యాల నడుమ పాశురాల పఠనం చేశారు. ఆలయ సంప్రదాయ ప్రకారం శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. తెలంగాణతో పాటు ఏపీ నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ప్రత్యేక వాహనాలు, బస్సుల్లో ఆలయానికి చేరుకుంటున్నారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. స్వామి వారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి దర్శనానికి దాదాపు గంట సమయం పడుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ప్రసాద విక్రయ శాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింద విష్ణు పుష్కరణి, కారు పార్కింగ్, బస్టాండ్లో సందడి నెలకొంది.