ఆంధ్రా (Andhra Pradesh) లోనూ సత్తా చాటాలని ఎన్నాళ్ల నుంచో పోరాడుతోంది బీజేపీ (BJP). ఈమధ్యే పార్టీ అధ్యక్ష మార్పు జరిగింది. ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువగా ఉన్న ఏపీలో బీజేపీ గెలుపు ఇప్పుడప్పుడే సాధ్యం కాని పనే అయినా.. పోరాటం సాగిస్తున్నారు కమలనాథులు. అయితే.. పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి (Purandeswari).. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అమిత్ షా (Amit Shah) తో లోకేష్ (Lokesh) భేటీ సందర్భంగా పురందేశ్వరి కూడా ఉండడంతో వైసీపీ శ్రేణులు ఈమెను టార్గెట్ చేశారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి టీడీపీతో కలిసి తమ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారనేది వైసీపీ వాదన. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉండి.. మరోపార్టీ నాయకుడిని అమిత్ షా వద్దకు ఎలా తీసుకెళ్లారని ప్రశ్నిస్తున్నారు. భారతీయ జనతా పార్టీలో చాలామంది నేతలు టీడీపీకే ఎక్కువగా పనిచేస్తున్నారని.. తాము ఎప్పటినుంచో చెబుతున్న మాటలు నిజమయ్యాయని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్(ఎక్స్)లో వరుస పోస్టులు పెట్టారు.
అవినీతి కేసులో చంద్రబాబును అరెస్టు చేస్తే టీడీపీ నేతలకన్నా పురందేశ్వరికే ఎక్కువ బాధగా ఉన్నట్టు ఉందన్నారు విజయసాయి. తనకు పదవినిచ్చిన పార్టీకన్నా బంధుత్వం, బావ పార్టీనే ఎక్కువంటున్నారని సెటైర్లు వేశారు. ఢిల్లీలో ఆమె విన్యాసాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. అంతకుముందు చంద్రబాబు అవినీతిని రాష్ట్ర సీఐడీ, కేంద్ర ఈడీ, కేంద్ర ఐటీ నిర్ధారించాయని చెప్పారు. అలాంటప్పుడు బాబుకు మీ మద్దతు అంటే దాని అర్థం ఏమిటి? మీది నేరానికి మద్దతా? లేక చట్టానికి మద్దతా? అంటూ పురందేశ్వరిని ప్రశ్నించారు.
వైసీపీ ట్రోలింగ్ పై బీజేపీ, టీడీపీ స్పందించాయి. లోకేష్ ఢిల్లీలో అమిత్ షాను కలవడం వెనుక పురందేశ్వరి లేరని అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులును, చంద్రబాబుపై కేసులను వివరించేందుకు లోకేష్.. అమిత్ షాను కలిశారని చెప్పారు. లోకేష్ వెళ్ళేసరికి పురందేశ్వరి కూడా అక్కడే ఉన్నారని అన్నారు. పురందేశ్వరితో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఉన్నారని వివరిస్తున్నారు. ప్రణాళిక ప్రకారం లోకేష్, పురందేశ్వరి కలిసి వెళ్లలేదని చెబుతున్నారు. ఇటు, వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండిస్తున్నారు.