దేశంలో అధికంగా యువత ఫేస్బుక్ ( Face Book), ఇన్ స్టా గ్రామ్ సమయం గడుపుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. రోజుకు సుమారు 7.30 గంటల పాటు సోషల్ మీడియాలో యువత కాలం వెళ్లదీస్తున్నారని పేర్కొన్నారు. యువత ఉద్యోగాలు లేక, నిరుద్యోగిత కారణంగా ఫేస్బుక్, ఇన్స్ట్రాగ్రామ్లలో ఎక్కువ సమయం గడుపుతున్నారని వెల్లడించారు.
ఎంపీలపై సస్పెన్షన్ వేటును నిరసిస్తూ జంతర్ మంతర్ వద్ద విపక్ష ఇండియా కూటమి నిరసన ప్రదర్శన చేపట్టింది. ఈ నిరసన ప్రదర్శనలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….. ఇటీవల పార్లమెంట్లో భద్రతా వైఫల్యం తలెత్తిందన్నారు. ఇద్దరు వ్యక్తులు లోక్ సభలోకి స్మోక్ క్యానన్లు తీసుకు వచ్చారని అన్నారు. ఆ వస్తువులు తీసుకు వచ్చారంటే వాళ్లు మరేదైనా వస్తువులు కూడా తీసుకు వచ్చేందుకు అవకాశం ఉందన్నారు.
దేశంలోని నెలకొన్న నిరుద్యోగంపై మీడియా మాట్లాడటం లేదని మండిపడ్డారు. కానీ పార్లమెంట్ బయట సస్పెండ్ అయిన ఎంపీల నిరసన వీడియోను తీసినందుకు మాత్రం తనను ప్రశ్నిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అసలు ఆ వ్యక్తులు ఈ తరహాలో పార్లమెంట్లో నిరసన ఎందుకు తెలపాల్సి వచ్చిందనే విషయంపై మరో ప్రశ్న తలెత్తుతోందని అన్నారు.
దేశంలో పెరిగిన నిరుద్యోగితే ఈ ఘటనకు కారణమన్నారు. యువకులు సోషల్ మీడియాలో ఎంత సమయం గడుపుతున్నారనే విషయంపై ఓ చిన్న సర్వే నిర్వహించామని తెలిపారు. అందులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. రోజుకు సుమారు 7.30 గంటల పాటు యువత ఫేస్బుక్, ఇన్ స్టా గ్రామ్స్ లో గడుపుతున్నారని చెప్పారు. దీనికి కారణం ఏమిటి? అని అన్నారు. యువతకు మోడీ ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. సెల్ ఫోన్లు చూసుకుంటూ కాలం గడిపేసే అవకాశం ఇచ్చారని ధ్వజమెత్తారు. ఇది బీజేపీ ప్రభుత్వ తప్పన్నారు. అందువల్లే వాళ్లు పార్లమెంటు హౌస్లోకి దూకుతున్నారన్నారు.