కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని కలిశారు. తన కుమారుడి వివాహానికి రావాలంటూ రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రికను షర్మిల అందజేశారు. ఫిబ్రవరి 17న అట్లూరి ప్రియతో షర్మిల తనయుడు రాజారెడ్డి వివాహం జరగనుంది.
షర్మిల ఆహ్వానానికి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. కాబోయే వధూవరులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఇలా వుంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో షర్మిల భేటీ అవుతారని తెలుస్తోంది. తన కుమారుడి వివాహానికి ప్రతిపక్ష నేత చంద్రబాబును ఆమె ఆహ్వానించనున్నట్టు సమాచారం.
ఒకటి రెండు రోజుల్లో జూబ్లిహిల్స్ లోని చంద్రబాబు నివాసంలో ఆయన్ని ఆమె కలుస్తారని తెలుస్తోంది. వైఎస్ రాజారెడ్డి-అట్లూరి ప్రియాలది ప్రేమ వివాహం. ఈ నెల 18న అట్లూరి ప్రియతో షర్మిల కుమారుడి నిశ్చితార్థం, ఫిబ్రవరి 17న వివాహం జరగనున్నాయి. దీంతో ఇటీవల ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద తొలి ఆహ్వాన పత్రికను పెట్టి ఆయన ఆశీస్సులను తీసుకున్నారు.
అనంతరం తన సోదరుడు సీఎం జగన్ ను కలిసి షర్మిల వివాహ ఆహ్వానం అందజేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ ను కలిసిన షర్మిల తన కుమారుడి నిశ్చితార్థానికి రావాలని ఆహ్వానించారు. ఆ తర్వాత రోజు ఆమె ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత తాజాగా తొలి సారి రేవంత్ రెడ్డిని ఆమె కలిశారు.