ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లో మహిళ ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ (Congress) మరో కీలక హామీ ఇచ్చింది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో గృహలక్ష్మీ యోజన పథకాన్ని అమలు చేస్తామని సీఎం భూపేశ్ బాఘేల్ వెల్లడించారు. ఈ పథకం కింద మహిళలకు ఏడాదికి రూ. 15000ల చొప్పున మహిళల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామన్నారు.
ఈ నూతన పథకం గురించి సీఎం భూపేశ్ బఘేల్ మీడియా సమావేశంలో తెలిపారు. మొదట రాష్ట్ర ప్రజలకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. నేడు దీపావళి శుభ సందర్భంగా మాత లక్ష్మి జీ, ఛత్తీస్గఢ్ మహతారి ఆశీర్వాదంతో, మహిళా సాధికారత కోసం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నామని సీఎం వెల్లడించారు.
చత్తీస్గఢ్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. చత్తీస్ గఢ్లో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 20 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 7 పోలింగ్ నిర్వహించారు. మిగిలిన 70 స్థానాలకు ఈ నెల 17న రెండవ విడత ఎన్నికలను నిర్వహించనున్నారు.
అంతకు ముందు ఈ నెల 5న కాంగ్రెస్ తన మెనిఫెస్టోను ప్రకటించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కుల గణన చేపట్టనున్నట్టు వెల్లడించింది. రైతుల రుణాలను మాఫీ చేస్తామని, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ ధరకు అందిస్తామని మెనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది.