బడ్జెట్ (Budget) ప్రసంగంలో వ్యవసాయ రంగం గురించి ప్రస్తావిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ రంగం (Agriculture Sector)లో రైతుల ఆదాయాన్ని పెంచే ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద 11.8 కోట్ల మంది చిన్న సన్నకారు రైతలుకు ఆర్థిక సహాయం అందించామని చెప్పారు.
రైతులకు కనీస మద్దతు ధరలు క్రమానుగతంగా, తగిన విధంగా ప్రకటిస్తామన్నారు. పేదలు, మహిళలు, యువత, రైతుల అవసరాలే ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలని వివరించారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద 4 కోట్ల మంది రైతులకు పంటల బీమా అందించామన్నారు. వ్యవసాయం, రైతుల సంక్షేమానికి రూ. 1.27 లక్షల కోట్లు కేటాయించింది.
పీఎం కిసాన్ సంపద యోజన ద్వారా 38 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరిందని, 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని ఆమె తెలిపారు. పీఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ యోజన కింద 2.4 లక్షల ఎస్‌హెచ్‌జీలు, 60,000 మంది వ్యక్తులకు క్రెడిట్ లింక్‌లను అందించామన్నారు.
ప్రభుత్వం తీసుకు వచ్చిన ఇతర పథకాలు పంట అనంతర నష్టాలను తగ్గించడంలో, ఉత్పాదకత, ఆదాయాలను మెరుగుపరచడంలో సహాయపడతాయని చెప్పుకొచ్చారు. అగ్రిగేషన్, ఆధునిక నిల్వ, సప్లై చైన్స్, ప్రైమరీ, సెకండరీ ప్రాసెసింగ్, మార్కెటింగ్, బ్రాండింగ్‌తో సహా పంట అనంతర కార్యకలాపాల్లో ప్రైవేట్, ప్రభుత్వ పెట్టుబడులను ప్రభుత్వం మరింత ప్రోత్సహిస్తోందన్నారు.
ఆత్మనిర్బర్ ఆయిల్ సీడ్స్ అభియాన్ కింద ఆవాలు, వేరుశెనగ, సోయాబీన్, నువ్వులు, పొద్దుతిరుగుడు వంటి నూనె గింజల్లో స్వావలంబన సాధించడానికి వ్యూహాన్ని రూపొందించనున్నట్లు సీతారామన్ చెప్పారు. ఇందులో అధిక దిగుబడినిచ్చే రకాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించడం, మార్కెట్ అనుసంధానాలు, సేకరణ, విలువ జోడింపు, పంట బీమాలో పరిశోధనలను కవర్ చేస్తుందన్నారు.