తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రేటర్ అధికారులు కీలక విషయాన్ని ప్రకటించారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్తగా 15 లక్షల(15Lacs New Voters) మంది కొత్త ఓటర్లు పెరిగినట్లు వారు అంచనా వేస్తున్నారు. దీనిప్రకారం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్(Hyderabad Parliament Segement) సెగ్మెంట్కు జరిగే ఎన్నికల్లో టఫ్‌ఫైట్ ఉంటుందని రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధి క్రమంగా విస్తరిస్తోంది.
అందుకు అనుగుణంగానే ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. 2019 పార్లమెంట్ ఎన్నికల టైంలోని ఓటర్ల సంఖ్యతో పోలిస్తే ఇప్పుడు 15 లక్షల అధిక ఓటర్ల సంఖ్య పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ సంఖ్య పెరగడం లేదా తగ్గే చాన్స్ కూడా ఉన్నట్లు సమాచారం. ఎన్నికల కమిషన్ అధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఓటర్ల సంఖ్య 1.05 కోట్లు దాటింది.
తెలంగాణలోని మొత్తం ఓటర్లలో ఈ సంఖ్య 30శాతం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు బతుకుదెరువు కోసం నగరానికి వలసొచ్చి అక్కడే పనులు చేసుకుంటూ స్థిరపడిపోతున్నారు.ఇందులో కొందరు హైదారాబాద్‌లోనే తమ ఓటు హక్కును నమోదు చేసుకుంటున్నారు. దీంతో నగరంలో ఓటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
మరికొందరు హైదరాబాద్‌లో స్థిరపడిన ఎన్నికల సమయంలో తమ సొంతూర్లకు వెళ్లి ఓటేసి వస్తున్నారు. అయితే, ఈసారి పెరిగిన ఓటర్లలో ఎక్కువ మంది యువతే ఉన్నట్లు తెలుస్తోంది.వీరి ఓటు రాజకీయ నాయకుల భవిష్యత్‌ను డిసైడ్ చేయనుంది.గత రెండు పర్యాయాలు లోక్‌సభ పోలింగ్ పర్సంటేజీని తీసుకుంటే హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో 2014లో 53.27%, 2019లో 39.49%, సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో 2014లో 53.06%, 2019లో 44.99%, మల్కాజిగిరిలో 2014లో 51.05%, 2019లో 49.11%, చేవెళ్లలో 2014లో 60.51%, 2019లో 53.80% పోలింగ్ శాతం నమోదైంది.గ్రేటర్ పరిధిలోని ఎంపీ స్థానాల్లో ఓటర్ల సంఖ్య పెరిగినా పోలింగ్ పర్సంటేజీ మాత్రం తగ్గుతూ వస్తోంది. ఈసారైనా నగరవాసులు ఓటింగ్‌లో చురుకుగా పాల్గొంటారో లేదో వేచిచూడాలి.