మెక్సికోలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో కొందరు భారతీయులతో సహా 18 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు.
సుమారు 42 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు మెక్సికో బోర్డర్ టౌన్ అయిన తిజువానా కు వెళ్తూ ఓ లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇండియాకు చెందిన కొందరు భారతీయులతో బాటు డొమినికన్ రిపబ్లిక్, ఆఫ్రికా దేశాల వాసులు కూడా మృతి చెందారు.
అత్యంత వేగంతో వెళ్తూ ఈ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపిన బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ యాక్సిడెంట్ లో మృతులు, గాయపడినవారిని గుర్తించవలసి ఉందన్నారు.
క్షతగాత్రుల్లో 20 మందిని ఆసుపత్రికి తరలించామని, ఒక మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వారు చెప్పారు. ఎలైట్ ప్యాసింజర్ లైన్ కి చెందిన ఈ బస్సు .. బరాంకా బ్లాంకా వద్ద లోయలో పడిపోయిందన్నారు.
131 అడుగుల లోయలో ఈ వాహనం పడిపోవడంతో సహాయక చర్యలు నిర్వహించడం కష్ట సాధ్యంగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ ఘోర దుర్ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.