Telugu News » తగ్గేదే లేదంటున్న టమాట….ఇక కేజీ ఎంతో తెలుసా..!?

తగ్గేదే లేదంటున్న టమాట….ఇక కేజీ ఎంతో తెలుసా..!?

by sai krishna

టమాటా రైతు సంపాదించే లెక్కలు బావున్నాయి.. కొనేవాళ్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. కొనుగోలు దారులు మా ఇంట్లో టమాట ప్రవేశం లేదని బోర్డు కూడా పెట్టేస్తున్నారు. కేటరింగ్ మెనూల్లోంచి టమాటాను తొలగించారు.

ఇదివరకు ప్రతీవంటలో పెద్దముత్తైదులా తగుదునమ్మా అని ముందుండే టమాటా ఫ్రిజ్ గడప దాటి ఏనాడో బయటకు పోయింది. అది లేకుండా వంట పూర్తవదనే మహిళలు చెట్టెక్కి కూర్చున్న టమాటా రేట్ల దృష్ట్యా కిమ్ అనకుండా టమాట మాట లేకుండా వంటచేస్తున్నారు.

అయినా టమాటాకు ఏమాత్రం క్రేజ్ తగ్గని పరిస్థితి కనిపిస్తోంది. దీని ధర డబుల్ సెంచరీ దాటి సామాన్య ప్రజల జేబులకు చిల్లుపెడుతోంది. నిత్యం వంటలో టమాటా తప్పనిసరి కావడంతో.. వాటి ధర ఎప్పుడు తగ్గుతుందా అని అంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఇలాంటి తరుణంలో వ్యాపారులు షాకింగ్ న్యూస్ చెప్పారు. త్వరలో టమాటా ధరలు తగ్గడం కాదుకదా.. భారీగా పెరగనున్నట్లు వెల్లడించారు. ఏకంగా కిలో టమాటా రూ.300కు చేరే అవకాశం ఉందని తెలిపారు

టమాటా, క్యాప్సికం, ఇతర సీజనల్ కూరగాయల ధరలు భారీగా పెరగడంతో విక్రయాలు పడిపోయాయని.. దీంతో హోల్ సేల్ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (APMC) సభ్యుడు కౌశిక్ తెలిపారు.

హోల్ సేల్ మార్కెట్ లో కిలో రూ.160 ఉన్న టమాటా ధరలు ప్రస్తుతం రూ.220కి చేరాయని, దీంతో రిటైల్ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు ముఖ్యంగా కీలకమైన టమాటా ఉత్పత్తి ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.

దీంతో మార్కెట్ లో కొరత కారణంగా ధరలు భారీగా పెరిగాయని వెల్లడించారు. ‘హిమాచల్ ప్రదేశ్ లో కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షం కారణంగా కూరగాయల రవాణాలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఉత్పత్తిదారుల నుంచి కూరగాయల ఎగుమతిలో సాధారణం కంటే 6 నుంచి 8 గంటల ఎక్కువ సమయం పడుతోంది.

దీని కారణంగా టమాటా ధరలు దాదాపు రూ.300 కి చేరుకోవచ్చు’ అని ఢిల్లీలోని ఆజాద్ పూర్ మండి హోల్ సేల్ వ్యాపారి సంజయ్ భగత్ తెలిపారు. అయితే, ఇదే పరిస్థితులు కొనసాగితే మాత్రం రానున్న రోజుల్లో కిలో టమాటా రూ.400కు చేరువైనా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నాయి మార్కెట్ వర్గాలు.

హిమాచల్ ప్రదేశ్‌లో జులైలో భారీ వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో అక్కడి నుంచి ఎక్కువగా వచ్చే క్యాప్సికం ధరలు భారీగా పెరిగాయి. మార్కెట్‌లో టమాటాకు సప్లయ్, డిమాండ్ రెండూ తక్కువగా ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

టమాటాలు, క్యాప్సికం, క్యాలీఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయల ధరలు ఎక్కువ ఉండడంతో వాటిని కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఆసక్తి చూపట్లేదని చెబుతున్నారు.

You may also like

Leave a Comment