ఈనెల 16 దాకా ఓ మోస్తరు వానలు (Rains) ఉంటాయని వాతావరణశాఖ (IMD) సోమవారం చెప్పింది. అయితే.. ఓ మోస్తరు కాస్త భారీ వర్షాలకు షిఫ్ట్ అయినట్టు తాజాగా వెల్లడించింది. తెలంగాణలో గత 15 రోజులుగా సరైన వర్షాలు లేవు. జులై (July) చివరి వారంలో కురిసిన వానలే.. ఆ తర్వాత వాన జాడ లేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రైతులకు ఈనెల ఎంతో కీలకం. ఈ సమయంలో వర్షాలు పడితేనే పంట ఎదుగుదలకు ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు వర్షాలు పడతాయని అధికారులు చెప్పడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు(Farmers).
రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది వాతావరణశాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా.. మయన్మార్, బంగ్లాదేశ్ సమీపంలోని మేఘాలు తెలుగు రాష్ట్రాలను ఆవరించాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. 19 వరకు ఇది ఇలాగే కొనసాగుతోందని అధికారులు అంటున్నారు.
హైదరాబాద్, మల్కాజిగిరి, యాదాద్రి, సిద్దిపేట, నల్గొండ జిల్లాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లో తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేసింది వాతావరణశాఖ. ఈనెల 18,19 తేదీలలో అయితే.. తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెబుతోంది.
మరోవైపు, ఆవర్తన ప్రభావం వల్ల ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమపై మాత్రం ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది. చెన్నై సమీపంలోని బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడిందని.. అది బలపడితే రాయలసీమలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటోంది వాతావరణశాఖ.