ఓటమి అనే మూడు అక్షరాలు మిగిల్చే వేదన అంతా ఇంతా కాదన్నట్లుగా బీఆర్ఎస్ (BRS) పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రిగా పదేళ్లు తిరుగులేని అధిక్యతను ప్రదర్శించిన గులాబీ బాస్.. ముచ్చటపడి కట్టించుకున్న ప్రగతి భవన్ ఖాళీ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. దేశ రాజధాని ఢిల్లీ (Delhi)..తుగ్లక్ రోడ్ లో.. 20 ఏళ్లుగా అనుబంధం ఉన్న ఇంటిని సైతం విడిచి పెట్టేయాల్సిన పరిస్థితి వచ్చేసింది.
మరోవైపు తుగ్లక్ రోడ్ లోని ఇంటితో కేసీఆర్ (KCR)కు ఉన్న అనుబంధం ఇప్పటి కాదు. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్‌లో ఉన్న ఇంటిలో 2004 నుంచి కేసీఆర్ ఉంటున్నారు.. ఈ ఇల్లు కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పటి నుండి అధికారిక నివాసంగా ఉంది. ఆ తర్వాత సీఎంగా ఉన్న సమయంలో కూడా ఆ ఇంటిని కంటిన్యూ చేశారు.. కాగా ప్రస్తుతం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన నేపథ్యంలో హస్తినలోని కేసీఆర్ అధికారిక నివాసాన్ని సిబ్బంది ఖాళీ చేస్తున్నారు.
అయితే కేంద్రం ఆయా రాష్ట్రాల సీఎంలకు దేశ రాజధానిలో క్వార్టర్లను కేటాయిస్తుంది. ఈ క్రమంలో 2014 ఎన్నికల్లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావటం తెలిసిందే. అందువల్ల తుగ్లక్ రోడ్ లోని నివాసాన్ని అలానే ఉంచేశారు. మరోవైపు నిజామాబాద్ (Nizamabad) ఎంపీగా గెలిచిన కవిత (Kavitha) తన తండ్రికి కేటాయించిన క్వార్టర్ లోనే ఉండిపోయారు. తన అధికార నివాసంగా ఎంపిక చేసుకున్నారు.
ఇక 2018లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ రెండో సారి ముఖ్యమంత్రిగా ఎంపిక కావటంతో అదే క్వార్టర్ కంటిన్యూగా ఉంది.. తాజాగా వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో అధికారాన్ని కోల్పోయిన నేపథ్యంలో ఢిల్లీలోని తుగ్లక్ క్వార్టర్ ను ఖాళీ చేయాల్సి వచ్చింది. మొత్తంగా కేసీఆర్ 20 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ఉన్న క్వార్టర్ తో బంధం తెంచుకోవలసి వచ్చింది. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన క్వార్టర్.. తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వేళ.. చేజారిపోవటం గమనార్హం..