దేశంలో త్వరలో లోక్ సభ సార్వత్రిక ఎన్నికల (Loksabha Electionsను నిర్వహించనున్నారు. ఇప్పటికే విపక్ష కూటమిలో సీట్ల సర్దుబాటు గురించి చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టేందుకు ప్రధాని మోడీ (PM Modi) రెడీ అవుతున్నారు. ఈ నెల 13న ఆయన ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడతారని తెలుస్తోంది.
బిహార్ చంపారన్‌లోని బెట్టయ్య నగరంలోని రామన్ మైదానం నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని షురూ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బిహార్ పర్యటన సందర్బంగా పలు అభివృద్ధి పథకాలకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో 40 స్థానాల్లో విజయం సాధించాలని కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు.
ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరిలో ప్రధాని మోడీ, అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో పెద్ద ఎత్తున బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. జనవరి 15 తర్వాత ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ముమ్మరం చేయనున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. సీతామర్హి, మధేపురా, నలందాల్లో అమిత్ షా ప్రచార సభల్లో పాల్గొంటారని, సీమాంచల్‌లో జేపీ నడ్డా పర్యటించనున్నారు.
ఇక ప్రధాని మోడీ బెగూసరాయ్, బేతయ్య , ఔరంగబాద్ తో పాటు పలు నియోజక వర్గాల్లో ప్రధాని మోడీ ప్రచారాన్ని నిర్వహించనున్నారు. విపక్ష ఇండియా కూటమిలో బిహార్ సీఎం నితీశ్ కుమార్ కీలకంగా ఉన్నారు. ఇండియా కూటమిని కన్వీనర్ గా ఆయన్ని ప్రకటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రధాని అభ్యర్థి రేసులో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిహార్ లో నితీశ్ కుమార్ కు చెక్ పెట్టే విధంగా ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టాలని కాషాయ పార్టీ యోచిస్తున్నట్టు సమాచార్ం.