వలసవాదుల పాలనలో భారతీయులపై జరిగిన దురాగతాలకు లెక్కేలేదు. జలియన్ వాలా బాగ్ (Jalian Wala Bhag) లాంటి దురాగతాలు బ్రిటీష్ (British) పాలకుల క్రూరత్వానికి కొన్ని మచ్చు తునకలు మాత్రమే. చరిత్ర పుటల్లోకి ఎక్కని దురాగతాలు ఇంకెన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో బరేలీ హింసాకాండ ఒకటి. బ్రిటీష్ పాలకులకు ఎదురు తిరిగినందుకు బరేలీలో ఒకే మర్రి చెట్టుకు 257 మందిని సామూహికంగా ఉరితీశారు.
1857 తిరుగుబాటు సమయంలో రోహిల్ ఖండ్ ప్రాంతానికి బరేలీ హెడ్ క్వార్టర్‌గా ఉంది. 31 మే 1857న తిరుగుబాటు దళాలు రాయ్ బరేలీ కళాశాల ప్రిన్సిపల్, ఇతర బ్రిటీష్ అధికారులను హతమార్చాయి. ఆ రోజున బరేలీని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించారు. అనతంరం షహీద్ ఖాన్ బహదూర్ ఖాన్, మున్షి శోభారాం, మదర్ అలీ, నియాజ్ మహమ్మద్ లను బరేలి ప్రాంత పాలనను చూసుకున్నారు.
సుమారు పది నెలల పాటు బరేలి ప్రాంతాన్ని తిరుగుబాటు దళాలు తమ ఆధీనంలో ఉంచుకున్నాయి. ఈ క్రమంలో 6 మే 1858న బ్రిటీష్ సైన్యం తిరుగుబాటు దళాలపై దాడి చేశాయి. యుద్దంలో తిరుగుబాటు దళాలు ఓడిపోయాయి. బరేలీ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ సైన్యం వెంటనే తిరుగుబాటుదారులను బంధించింది.
బరేలీ విప్లవకారులపై బ్రిటీష్ న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ కేసులో షహీద్ ఖాన్ బహదూర్ ఖాన్‌కు ప్రధాన దోషిగా కోర్టు తేల్చింది. దీంతో ఆయనకు మరణశిక్షను విధించింది. 24 ఫిబ్రవరి 1861న బహదూర్ ఖాన్ కు ఉరిశిక్షను అమలు చేశారు. కమిషనర్ కార్యాలయంలోని మర్రి చెట్టుకు 257 మందిని ఉరి తీశారు. స్వాతంత్యం అనంతరం ఆ మర్రి చెట్టు వద్ద భారత ప్రభుత్వం అమర వీరుల స్థూపాన్ని నిర్మించింది.