ఆస్ట్రేలియా (Australia)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విక్టోరియా రాష్ట్రం పిలిప్ ఐలాండ్ (Philip Island) లో బీచ్ కు వెళ్లిన నలుగురు భారతీయు (Indians)లు నీటిలో మునిగి మృతి చెందారు. ఈ మేరకు విషయాన్ని కాన్ బెర్రాలోని ఇండియన్ హై కమిషన్ వెల్లడించింది. మృతుల కుంటుబాలకు హైకమిషన్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపింది.
‘ఆస్ట్రేలియాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. విక్టోరియాలో పిలిప్ ఐలాండ్ బీచ్లో నీటిలో మునిగి పోయి నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. అవసరమైన సహాయం చేసేందుకు సీజీఐ మెల్ బోర్న్ టీం మృతుల స్నేహితులతో టచ్ లో ఉంది’అని ట్వీట్ చేసింది.
నలుగురు వ్యక్తులు నీటిలో మునిగిపోతున్నట్టు అత్యవసర సర్వీసుల విభాగానికి బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు సమాచారం అందిందని అధికారులు తెలిపారు. వెంటనే రెస్క్యూ బృందాలను ఘటనా స్థలానికి పంపించామని పేర్కొన్నారు. ముగ్గురు మహిళలతో పాటు ఒక యువకున్ని నీటి నుంచి బయటకు తీశామని వెల్లడించారు.
వారికి వెంటనే సీపీఆర్ అందించామన్నారు. వారిలో ఇద్దరు మహిళలు, యువకుడు అప్పటికే మృతి చెందారని వివరించారు. మరో యువతిని ఎయిర్ లిఫ్ట్ చేసి మెల్ బోర్న్ లోని ఆస్పత్రికి తరలించామని వివరించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి కూడా మృతి చెందినట్టు చెప్పారు. మృతులు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లకు చెందిన వారిగా తెలుస్తోంది