బడ్జెట్‌లో రైల్వేలకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కీలక ప్రకటన చేశారు. రైల్వేలో ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని మెరుగు పరించేందుకు గాను 40,000 సాధారణ రైల్వే బోగీలను వందే భారత్ (Vande Bharat) రైలు తరహాలో అప్ గ్రేడ్ చేస్తామని తెలిపారు.
2024-25 ఆర్థిక సంవత్సరానికి మౌలిక సదుపాయాల కోసం నిధులను రూ. 11.11 లక్షల కోట్లకు పెంచినట్లు ఆమె వెల్లడించారు. ప్రధాన మంత్రి గతి శక్తి పథకం కింద మూడు ప్రధాన రైల్వే ఎకనామిక్ కారిడార్ కార్యక్రమాలను అమలు చేస్తామని చెప్పారు. అందులో శక్తి, ఖనిజ, సిమెంట్ కారిడార్, పోర్టు కనెక్టివిటీ కారిడార్, హై ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్లు ఉంటాయని పేర్కొన్నారు.
మల్టి మోడల్ కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు పీఎం గతి శక్తి కింద ఈ ప్రాజెక్టులు గుర్తించామని వివరించారు. ఈ కారిడార్లు లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయని, ఖర్చును తగ్గిస్తాయన్నారు. అధిక-ట్రాఫిక్ ఉన్న కారిడార్లలో రద్దీ తగ్గడం వల్ల ప్యాసింజర్ రైళ్ల కార్యకలాపాలను మెరుగుపరచేందుకు అవకాశం కలుగుతుందన్నారు. అంతే కాకుండా ప్రయాణీకులకు భద్రత, వేగవంతమైన ప్రయాణం కూడా అందుతుందని స్పష్టం చేశారు.
దేశంలోని పలు నగరాలను మెట్రో రైలు, నమో భారత్‌తో అనుసంధానించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. రాబోయే పదేండ్లలో కొత్త ఎయిర్ పోర్టులను ప్రారంభిస్తామని ప్రకటించారు. దశాబ్దకాలంలో విమానాశ్రయాల సంఖ్యను 149కి ప్రభుత్వం పెంచుతుందన్నారు. ఉడాన్ పథకం కింద 517 కొత్త మార్గాలను అనుసంధానించనున్నారని వివరించారు.