ఆరు గ్యారెంటీల అమలు కోసం కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించడాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) స్వాగతించారు. దరఖాస్తులు చేసుకోవాలని చెప్పడం బాగానే ఉందన్నారు. మరి కొత్త రేషన్ కార్డులు ఏవి? అని ఆయన ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలకు తెల్ల రేషన్ కార్డు అర్హతగా పేర్కొనడంపై ఆయన సందేహం వ్యక్తం చేశారు.
దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో సుపరిపాలనా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ…. 6 గ్యారంటీల అమలుకు నిధులు ఎలా సమకూరుస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణను ఎట్లా గట్టెక్కిస్తారో వెల్లడించాలన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే 10 లక్షలకు పైగా రేషన్ కార్డుల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. ఇంకా లక్షలాది మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు రెడీగా ఉన్నారని పేర్కొన్నారు. అందువల్ల తక్షణమే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. 6 గ్యారెంటీలను కొత్త రేషన్ కార్డు దరఖాస్తుదారులకు కూడా వర్తిపంజేయాలన్నారు.
రాజకీయాలకు అతీతంగా లబ్దిదారులను గుర్తించేందుకు అన్ని పార్టీలను భాగస్వాములను చేయాలని కోరారు. తబ్లిక్ జమాతే ముస్లిం దేశాలే నిషేధించాయని, అలాంటి సంస్థకు నిధులు ఎట్లా ఇస్తారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. గతంలో కొవిడ్ మహమ్మారి వ్యాప్తికి తబ్లిక్ జామాతే కారణమని గుర్తు చేశారు. ఉగ్రవాదులను తయారు చేసే సంస్థకు నిధులివ్వడం వెనుక ఉద్దేశమేంటో చెప్పాలని నిలదీశారు. ఇలాంటి సంస్థలకు ప్రభుత్వం తక్షణమే నిధులను ఉపసంహరించుకోవాలన్నారు.