వరుస భూకంపాలతో జపాన్ (Japan) వణికి పోతోంది. గడిచిన 24 గంటల్లో జపాన్‌లో 150కి పైగా భూకంపా (Earthqaukes)లు సంభవించాయి. వీటిలో ఉత్తర మధ్య జపాన్‌లో భారీ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6 గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. మరికొన్ని భూకంపాల తీవ్రత 6గా నమోదైనట్టు జపాన్ మెట్రలాజికల్ అథారిటి వెల్లడించింది. 4.0 తీవ్రతతో 50కి పైగా భూకంపాలు సంభవించినట్టు వెల్లడించారు.
మధ్య జపాన్‌లో సంభవించిన భూకంపంలో ఇప్పటి వరకు ఎనిమిది మంది మరణించారు. మృతులంతా హొన్షు పశ్చిమ తీరంలోని ఇషికావా ప్రి ఫెక్చర్ ప్రాంతానికి చెందిన వారిగా అధికారులు చెప్పారు. మరోవైపు ఇషికావా, నిఘాటా, తొయామా ప్రిఫెక్చర్‌లో సునామీ హెచ్చరికలు జేఎంఏ జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
సుమారు 5 మీటర్ల వరకు నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని తెలిపింది. అందువల్ల ఆయా ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది. భూకంపం ధాటికి భవనాలు కూలిపోయాయి. చాలా చోట్ల విద్యుత్ కు అంతరాయం కలిగింది. భవనాల శిథిలాల కింద చాలా మంది చిక్కుకు పోయినట్టు అధికారులు చెబుతున్నారు.
దేశంలో ప్రధాన రహదారులన్నీ ధ్వంసం అయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాలకు చేరుకోవడం సహాయక బృందాలకు ఇబ్బందికరంగా మారుతోంది. దీనివల్ల సహాయక చర్యలు మరింత ఆలస్యం అవుతోంది. నాలుగు ఎక్స్‌ప్రెస్‌వేలు, రెండు హైస్పీడ్ రైలు సేవలు, 34 లోకల్ రైలు మార్గాలు, 16 ఫెర్రీ లైన్‌లు నిలిచిపోయాయని జపాన్ రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. భూకంపాల కారణంగా 38 విమానాలు రద్దు చేసినట్టు పేర్కొంది. .