Telugu News » Telugu States : ఊపందుకున్న యాత్రలు.. అందరిదీ ఒకటే బాట!

Telugu States : ఊపందుకున్న యాత్రలు.. అందరిదీ ఒకటే బాట!

మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో యాత్రల సందడి నెలకొంది. అయితే.. ఏ పార్టీని గమనించినా అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి.

by admin
parties

– తెలుగు రాష్ట్రాల్లో యాత్రల సందడి
– రెండో విడత బస్సు యాత్రలో కాంగ్రెస్
– మలి విడత జిల్లాల బాటలో కేసీఆర్
– ‘‘నిజం గెలవాలి’’ అంటూ భువనేశ్వరి ప్రయాణం
– ‘‘విప్లవాన్ని వివరిద్దాం’’ అంటున్న వైసీపీ
– అధికారమే లక్ష్యంగా పార్టీల దూకుడు

తెలంగాణ (Telangana) లో ఎన్నికలకు నెల రోజులే టైమ్ ఉంది. ఉన్న ఈ కొద్ది సమయాన్ని గట్టిగా వాడేయాలని పార్టీలు పిక్స్ అయ్యాయి. ముఖ్యంగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని సీఎం కేసీఆర్ (KCR) అనేక వ్యూహాల్లో ఉన్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలను కవర్ చేసిన ఆయన.. మలి విడత జిల్లాల యాత్రను షురూ చేశారు. వరుసగా తీరిక లేకుండా వచ్చే నెల 28 దాకా సభలు, సమావేశాలతో బిజీ షెడ్యూల్ పెట్టుకున్నారు. ఇంకోవైపు, కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao) కూడా ఇతర నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తూ బీఆర్ఎస్ (BRS) శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు.

parties

గత రెండు పర్యాయాలు ఓటర్ల చేత తిరస్కరించబడ్డ కాంగ్రెస్ (Congress).. ఈసారి ఆరు గ్యారెంటీలు అంటూ ముందుకొచ్చింది. కర్ణాటక (Karnataka) స్ట్రాటజీని అమలు చేస్తూ పక్కాగా గెలుస్తామనే ధీమాగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే బస్సు యాత్రను ప్రారంభించింది. ఇప్పటికే తొలి విడత పూర్తవ్వగా.. రెండో విడత యాత్ర కోసం ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. 26, 27న ఇంటింటి ప్రచారం, 28 నుంచి‌‌‌‌‌‌‌‌ వచ్చే నెల 1 వరకు బస్సు యాత్ర చేపట్టనుంది. ఈ యాత్రకు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీతోపాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రానున్నారు. ఉమ్మడి మహబూబ్ ​నగర్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఈ బస్సు యాత్రను ప్లాన్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోనూ యాత్రల జోరు ఊపందుకుంటోంది. ఎన్నికలకు ఇంకా టైమ్ ఉన్నా.. ఇప్పటి నుంచే పార్టీలు స్పీడ్ పెంచాయి. చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ తో ఏపీలో రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. టీడీపీ (TDP), జనసేన (Janasena) మధ్య పొత్తు పొడిచింది. కలిసి ముందుకెళ్లేందుకు ప్రణాళికలు చేస్తున్నాయి పార్టీలు. ఉమ్మడి అజెండాతో జనంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగానే నవంబర్‌ 1 నుంచి ఇంటింటి ప్రచారం చేయాలని నిర్ణయించాయి. ఇటు, చంద్రబాబు భార్య భువనేశ్వరి (Bhuvaneswari) ‘నిజం గెలవాలి’ పేరుతో యాత్ర ప్రారంభించారు. ముందుగా నారావారిపల్లెలో ఎన్టీఆర్ (NTR) విగ్రహానికి నివాళులు అర్పించారు. తర్వాత, చంద్రగిరి బజారువీధిలో ప్రవీణ్‌ రెడ్డి ఇంటికి వెళ్లారు. అతని కుటుంబాన్ని పరామర్శించారు. టీడీపీ సోషల్ మీడియాలో ప్రవీణ్‌ రెడ్డి యాక్టివ్‌ గా పనిచేసేవాడు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఈనెల 18వ తేదీన చనిపోయాడు. తొలి విడతలో చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు భువనేశ్వరి. వివిధ కారణాలతో మృతి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారు.

మరోవైపు, అధికార వైసీపీ (YCP) ‘విప్లవాన్ని వివరిద్దాం’ అంటూ బస్సు (BUS) యాత్రకు సిద్ధమైంది. గత 53 నెలల సామాజిక విప్లవాన్ని, సంక్షేమాభివృద్ధిని వివరించేందుకు ప్లాన్ చేసింది. ఉత్తరాంధ్రలో ఇచ్ఛాపురం, కోస్తాలో తెనాలి, రాయలసీమలోని శింగనమలలో ఒకేసారి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ప్రతి రోజూ 3 చోట్ల ఒక్కో నియోజకవర్గంలో యాత్ర జరగుతుంది. ఒక్కో ప్రాంతంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ సమన్వయకర్త సారధ్యంలో డిసెంబర్ 31 వరకూ ఈ యాత్ర సాగనుంది. టీడీపీ, జనసేన పొత్తు నేపథ్యంలో ఇప్పటి నుంచే జనంలోకి వెళ్లాలని జగన్ (CM Jagan) నిర్ణయించారు. అందులో భాగంగానే బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో యాత్రల సందడి నెలకొంది. అయితే.. ఏ పార్టీని గమనించినా అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి.

You may also like

Leave a Comment