తెలంగాణ (Telangana) బీజేపీ (BJP) లో రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) రాజీనామా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీజేపీ (BJP) గ్రాఫ్ పడిపోయిందని.. బీఆర్ఎస్ (BRS) కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ (Congress) పార్టీయే అని ఆయన చేసిన వ్యాఖ్యలపై కమలనాథులు స్పందిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) మాట్లాడుతూ.. ఎవరి ఊహలు వారివి.. ఎవరి ఇష్టం వారిది అని వ్యాఖ్యానించారు. బీజేపీ పోటీలో లేదని ఆయనంటే అయిపోతుందా.. ప్రజలు అనుకోవాలని అన్నారు.
రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పిన కిషన్ రెడ్డి.. రాజగోపాల్ రెడ్డికి పార్టీ మంచి అవకాశం ఇచ్చిందని, జాతీయ స్థాయిలో పదవి కట్టబెట్టామని చెప్పారు. అయినా పార్టీ మారడం ఆయన వ్యక్తిగత నిర్ణయమని వివరించారు. వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తూ ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. బీఆర్ఎస్ పాలనకు చెక్ పెట్టేది తామేనని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. తాజా పరిస్థితుల నేపథ్యంలో హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో బుధవారం కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు.
రాజగోపాల్ రెడ్డిని బీజేపీ గౌరవించి.. ఉన్నతమైన స్థానం కల్పించిందని ఎంపీ లక్ష్మణ్ (Laxman) తెలిపారు. వ్యక్తిగతంగా ఇటువంటి ఆరోపణలు చేయటం సరైంది కాదని.. కచ్చితంగా మూడోసారి నరేంద్ర మోడీ (PM Modi) ప్రధాన మంత్రి కాబోతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామనే నమ్మకం తమకు ఉందని తెలిపారు. కాంగ్రెస్ ఎన్ని ఆరోపణలు చేసినా.. బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇక, జితేందర్ రెడ్డి (Jitender Reddy) మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డిని పాసింగ్ క్లౌడ్ అని వ్యాఖ్యానించారు. పార్టీ ఎప్పుడూ బలంగానే ఉంటుందని.. కొందరు అలా వచ్చి ఇలా వెళ్తారని చెప్పారు. తాను ఎంపీగానే పోటీ చేయాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలు బీజేపీని గెలిపించాలని అనుకుంటున్నారని.. మంచి పాలన ఇస్తామని వారికి తెలుసని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ పాలన చూసి రాష్ట్రంలో కూడా గెలిపించుకోవాలని చూస్తున్నారని అన్నారు. తాజా సర్వేలో 55 సీట్లు తగ్గకుండా బీజేపీకి వస్తాయని తేలిందన్నారు జితేందర్ రెడ్డి.
ఇది బ్రేకింగ్ న్యూస్ ఏమీ కాదు.. అందరూ ఊహించినదే జరిగిందని అన్నారు బూర నర్సయ్య గౌడ్. రాజగోపాల్ రెడ్డి శరీరం మాత్రమే బీజేపీలో ఉంది.. ఆత్మ కాంగ్రెస్ లోనే ఉండేదని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ని నమ్మే పరిస్థితిల్లో జనాలు లేరన్నారు. కేసీఆర్ ని ప్రగతి భవన్ నుంచి ఖాళీ చేయించే పనిలో రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరు ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యామ్నయం కేవలం బీజేపీ మాత్రమేనని.. అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే చేస్తానని క్లారిటీ ఇచ్చారు.