టీపీసీసీ (TPCC Chief) చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పీసీసీ చీఫ్ పోస్టును రూ.300 కోట్లకు కొనుక్కున్నాడంటూ కాంగ్రెస్ నేతలే చెప్పారని పేర్కొన్నారు. సొంత పార్టీ కార్యకర్తలకు కూడా న్యాయం చేయలేని రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రజలకు ఏం న్యాయం చేస్తాడంటూ ఆయన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
తనపై పోటీ చేయాలంటూ సీఎం కేసీఆర్ కు రేవంత్ విసిరిన సవాల్ పై ఆయన మండిపడ్డారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి మొదట తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఆ తర్వాత కేసీఆర్ పోటీ చేయాలని రేవంత్ రెడ్డికి సూచించారు. ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి అంటూ ఆయన తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు.
కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావ్ కదా అని గుర్తు చేశారు. మరి ఇప్పుడు పోటీ ఎలా చేస్తావ్? అని రేవంత్‌ను ఆయన ప్రశ్నించారు. కొడంగల్ ను కేటీఆర్ దత్తత తీసుకున్నాక తర్వాతే ఇక్కడ అభివృద్ధి జరిగిందన్నారు. కోస్గిలో, మద్దూర్‌లో రోడ్లు విస్తరణ జరిగిందని చెప్పారు.
మున్సిపాలిటీల అభివృద్ధి జరిగిందని వెల్లడించారు. డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు. గ్రామాల్లో రోడ్లు, సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ అమలు చేసిందన్నారు. అందువల్ల ప్రజలు బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న తనను ఈసారి 20 నుండి 30 వేల మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.