తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తు దాదాపు ఖాయమైంది. సీట్ల సర్దుబాటు విషయంలో చర్చలు సాగుతున్నాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, గ్రేటర్ హైదరాబాద్ లోని రెండు స్థానాలతోపాటు 32 సీట్లు కేటాయించాలని జనసేన పట్టుబడుతోంది. వీటిలో హైదరాబాద్ లో కీలకమైన శేరిలింగంపల్లి, కూకట్ పల్లి ఉన్నాయని సమాచారం. కానీ, బీజేపీ 6 నుంచి 10 స్థానాలు కేటాయించేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. అయితే.. బీజేపీకి బాగా పట్టున్న శేరిలింగంపల్లి నియోజకవర్గం జనసేన దృష్టిలో ఉండడం చర్చనీయాంశంగా మారింది. అటు, గత ఎన్నికల్లో గణనీయమైన ఓట్లు సాధించిన బీజేపీ అభ్యర్థి గజ్జల యోగానంద్ నాయకత్వంలో బీజేపీ ఈసారి గెలుపు దిశగా పయనిస్తోందని స్థానిక కమలం శ్రేణులు ధీమాగా ఉన్నాయి.
శేరిలింగంపల్లి నియోజకవర్గం ఐటీ హబ్. అనేక ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు, ప్రఖ్యాత విద్యాసంస్థలు, ప్రసిద్ధి చెందిన వ్యాపార వాణిజ్య సముదాయాలతో కొలువైన ప్రదేశం. అంతేకాకుండా, తెలంగాణలో అత్యధిక ల్యాండ్ వాల్యూ ఉండే ఏరియా. నాలుగు జిల్లాలకు చెందిన ప్రాంతాలతో ఉన్న పెద్ద నియోజకవర్గం. పైగా, మెజారిటీ ఓటర్లు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయిన వారే. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, ఉత్తర భారత దేశానికి చెందిన వారు చాలా మందే ఉన్నారు. వారిలో అధిక భాగం బీజేపీకి సపోర్ట్ చేస్తున్నవారే. దీనికితోడు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ బీజేపీ అభ్యర్థిత్వం దాదాపు ఖాయమైనట్టుగా వినబడుతోంది. యోగానంద్ ఇప్పటికే పార్టీ బలోపేతం కోసం కష్టపడుతున్నారు. ఈసారి గెలుపు పక్కా అనే ధీమాతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణకు ముంబై లాంటి.. శేరిలింగంపల్లి కీలకమైన సీటును మిత్ర పక్షానికి కేటాయించేంత తెలివి తక్కువ పని బీజేపీ చేయదని రాజకీయ పండితులు భావిస్తున్నారు.
మరోవైపు, జీవై ఫౌండేషన్ పేరుతో యోగానంద్ చేస్తున్న సేవా కార్యక్రమాలు జనంలోకి బాగా వెళ్లాయి. ముఖ్యంగా కరోనా సమయంలో ఆయన చేసిన సాయం అంతా ఇంతా కాదు. ఓవైపు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. ఇంకోవైపు తన ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి అండగా నిలిచారు యోగానంద్. ఈసారి శేరిలింగంపల్లిలో విజయ బావుటా ఎగురవేస్తామని గట్టి నమ్మకంతో ఉన్నారు. జనసేనతో పొత్తు మంచి పరిణామమే అయినా.. బీజేపీకి కీలకమైన శేరిలింగంపల్లిని త్యాగం చేయడం కరెక్ట్ కాదనేది పార్టీ శ్రేణుల వాదన.