ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాల్లో ఉహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. పదవులే ముఖ్యంగా నేతలు రాజకీయ చదరంగం ఆడుతున్నారని కార్యకర్తల్లో చర్చలు మొదలైయ్యాయి. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో వలసల చిత్రాలు అన్నీ కోణాల్లో కనిపిస్తున్నాయని అంటున్నారు. అసలే మరోసారి అధికార పగ్గాలు చేపట్టాలని బీఆర్ఎస్ లో పరిస్థితులని చక్కదిద్దుతున్న సీఎం కేసీఆర్ కి అసంతృప్తి నేతలు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు..
నిన్నటికి నిన్న బీజేపీ (BJP)కి షాక్ ఇచ్చి కాంగ్రెస్లో చేరుతున్నట్టు ప్రకటించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy).. తాజాగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ (MLC) కూచుకుళ్ల దామోదర్ రెడ్డి (Kuchukulla Damodar Reddy) బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్కు పంపించారని తెలుస్తుంది.
మరో వైపు కూచికుళ్ల.. కేసీఆర్కు రాసిన లేఖలో నాకు మీరు తగినంత ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ స్థానిక ఇబ్బందులు ఎన్నడు పట్టించుకోలేదని అందువల్ల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా అని పేర్కొన్నారు. కాగా ఎమ్మెల్సీ పదవికి మాత్రం రాజీనామా చేయని కూచుకుళ్ల.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశిస్తే అందుకు కూడా సిద్ధమని ప్రకటించారు.. మరోవైపు కూచుకుళ్ల కుమారుడు రాజేశ్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు.
నాగర్ కర్నూల్ అసెంబ్లీ అభ్యర్థిగా ఫస్ట్ లిస్టులో కాంగ్రెస్ రాజేశ్ రెడ్డి చోటు కల్పించింది. మరోవైపు ఈ షాక్ నుంచి తెరుకునే లోపలే బీఆర్ఎస్ కి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను గురువారం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు పంపించారు. మరోవైపు చెవేళ్ల ప్రజల కోరిక మేరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా అని రత్నం ప్రకటించారు..