ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రాణాలు తీయడానికైనా వెనుకాడని మావోయిస్టుల(Naxalite) కదలికలు తెలంగాణ(Telangana)లో అప్పుడప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. వారి మనుగడ తెలంగాణలో దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. తప్పు జరిగినప్పుడల్లా ఓ హెచ్చరికను జారీ చేస్తారు. తాజాగా అలాంటి హెచ్చరిక ఒకటి కలకలం రేపుతోంది.
సిద్దిపేట(Siddipet) జిల్లాలోని దుబ్బాక దుంపలపల్లి(Dubbaka Dumpalapalli) మధ్య ఉన్న పిల్లర్‌కు సీపీఐ మావోయిస్టు పార్టీ పేరుతో పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్ల ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఇసుక మాఫియా, భూ కబ్జాలు చేస్తున్నారని, ప్రశ్నించినవారి పైన దాడులు చేసి హత్యలు చేస్తున్నారని, ప్రజలపై బీఆర్ఎస్ నాయకులు పెత్తనం చెలాయిస్తున్నారని పేర్కొన్నారు.
ఇసుక మాఫియా, భూ అక్రమాలు ఇలాగే కొనసాగితే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని మావోయిస్టులు ఆ లేఖలో హెచ్చరించారు. అదేవిధంగా ‘ఈ అక్రమాలను తక్షణమే ఆపేయాలి.. లేకపోతే ప్రజల ముందు శిక్షలు తప్పవు..’ అంటూ మావోయిస్టులు పోస్టర్ల ద్వారా బీఆర్ఎస్ నాయకులకు హెచ్చరికలు జారీచేయడం స్థానికంగా కలకలం రేకెత్తిస్తోంది. ఈ పోస్టర్లు ఎవరు అంటించారు అనేది ప్రశ్నగా మిగిలింది.
మావోయిస్టుల లేఖతో ఏ క్షణంలో ఎక్కడ ఎవరికీ ఏం జరుగుతుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. చాలా రోజుల తర్వాత ఇక్కడ పోస్టర్లు వెలువడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పోస్టర్లు నిజంగా మావోయిస్టులే అతికించారా? లేదా స్థానికుల పనేనా? అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఈ పోస్టర్లకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్(Viral) అవుతున్నాయి.