కాంగ్రెస్ తరఫున కామారెడ్డిలో షబ్బీర్ అలీ (Shabbir Ali) బరిలో ఉంటారని మొదట్నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే.. ఆయన పోటీకి విముఖత చూపుతున్నట్టు ఈమధ్య ప్రచారం సాగింది. దీన్ని ఆయన ఖండించినా.. ప్రచారం మాత్రం ఆగడం లేదు. తాజాగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) కామారెడ్డిలో పోటీకి సై అనడంతో షబ్బీర్ అలీ పోటీపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదే క్రమంలో ఆపార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy) చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్ లో చర్చకు దారితీశాయి.
కామారెడ్డిలో కేసీఆర్ (KCR) పై రేవంత్ రెడ్డి పోటీకి నిలబడితే రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచే మొట్ట మొదటి స్థానం అదే అవుతుందని అన్నారు జీవన్ రెడ్డి. జగిత్యాల పట్టణంలోని పొన్నాల గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న జీవన్ రెడ్డి… బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. కేసీఆర్ ను ఓడగొట్టే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందని.. ముఖ్యమంత్రిని ఓడించేందుకు ప్రజలందరూ కసితో ఉన్నారని చెప్పారు.
కామారెడ్డి ప్రభావం రాష్ట్రమంతా ఉంటుందన్న ఆయన.. రేవంత్ రెడ్డిని ఈ విషయంలో మెచ్చుకుంటున్నానని తెలిపారు. ఆయన మొండోడు, ధైర్యవంతుడు అంటూ చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు టూరిస్ట్ స్పాట్ గా మారుతోందని గతంలో తాము చెప్పినట్లే నిజమైందన్నారు. గోదావరి వరద ప్రవాహం వస్తే ఇసుక తరలిపోతుందనే పరిజ్ఞానం కేసీఆర్ కు లేదని మండిపడ్డారు.
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కింద బొగ్గు గనులు ఉన్నాయని కేసీఆర్ కు తెలియదా? అని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. సీఎం సంతకాలు పెట్టమంటే ఆఫీసర్లు పెట్టారని ఆరోపించారు. సాంకేతికంగా పరిశీలించకుండా కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసినందుకు ఈఎన్సీ మురళీధర్ రావును జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ లోపంపై న్యాయ విచారణ జరిపి, జ్యూడీషయల్ ఎంక్వయిరీ చేయించి బాధ్యులను కటకటాల్లోకి పంపిస్తామని తెలిపారు.