కాంగ్రెస్ (Congress) పార్టీ టికెట్ల విషయంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీసీలకు అన్యాయం జరిగింది.. అగ్ర కులాలకు పెద్ద పీట వేశారని ఆయా వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రెండు విడతల్లో 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది హస్తం పార్టీ. మొదట 55 స్థానాలకు అభ్యర్థులను అనౌన్స్ చేయగా.. రెండో జాబితాలో 45 మంది పేర్లను ప్రకటించింది. కమ్యూనిస్టులకు 4 సీట్లు ఇచ్చేందుకే ఓకే చెప్పి.. మిగితా 15 స్థానాలను పెండింగ్ లో పెట్టింది. అయితే.. వంద స్థానాల్లో అత్యధికంగా రెడ్డిలకు 37 స్థానాలు కేటాయించడం వివాదాస్పదమైంది.
టికెట్ల విషయంలో సామాజిక న్యాయంపై ఫోకస్ పెట్టలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు ఇష్టం వచ్చినట్టు తిట్టిన నేతలకు కూడా టిక్కెట్లు ఎలా ఇస్తారు అంటూ కొందరు మండిపడుతున్నారు. అంతేకాదు, చాలా విషయాల్లో నిబంధనలు తుంగలో తొక్కారని సొంత పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
హాఫ్ టికెట్ గాళ్లకు కూడా టికెట్లు ఇచ్చారంటూ అధిష్టానంపై ఫైర్ అయ్యారు. ప్రజలకు దండాలు పెట్టేవారికి కాకుండా నాయకులకు దండాలు పెట్టేవారికి మాత్రమే కాంగ్రెస్ లో టికెట్లు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్ లో పార్టీ గెలిచే అవకాశం ఉన్న ఏకైక స్థానం జూబ్లీహిల్స్ అని.. అలాంటి సీటును నియోజకవర్గంతో సంబంధంలేని వారికి ఇచ్చారని ఫైరయ్యారు. తనకే టికెట్ ఇస్తానని మాణిక్ రావు థాక్రే కూడా చెప్పారని, తీరా జాబితాలో తన పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.
విజయారెడ్డికి ఖైరతాబాద్ టికెట్ ఇచ్చి తనను ఇవ్వకపోవడంపై మండిపడ్డారు విష్ణువర్ధన్. ఒకే ఇంట్లో రెండు టికెట్స్ ఇవ్వమనే వాదన నిజమైతే.. దానికి విరుద్ధంగా ఎంతో మందికి ఇచ్చారని విమర్శించారు. ఎస్సీ, బీసీ, సెటిలర్స్ ఓట్లు అత్యధికంగా ఉన్న జూబ్లీహిల్స్ లో కేవలం ముస్లిం కమ్యూనిటీ కోసం టికెట్ ఇవ్వడం దారణమన్నారు. జూబ్లీహిల్స్ టికెట్ విషయంలో విష్ణువర్ధన్ రెడ్డిని పక్కకు పెట్టి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు ఛాన్స్ ఇచ్చింది కాంగ్రెస్.