ఇజ్రాయెల్, హమాస్ల మధ్య మూడు వారాలుగా భీకర యుద్ధం(Israel, Hamas War) కొనసాగుతూనే ఉంది. పరస్పరం బాంబు దాడులతో అక్కడ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఈ యుద్ధంలో మృతుల సంఖ్య ఇప్పటికే 9000 దాటింది. ఈ యుద్ధం రెండవ దశ ప్రారంభమైందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamain Netanyahu) అన్నారు.
గాజాపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన భారీ బాంబు దాడిపై నెతన్యాహు స్పందించారు. ‘ఈ దశ కచ్చితంగా సుదీర్ఘమైనది. కష్టాలతో నిండి ఉంటుంది.. కానీ మన సైన్యం వెనక్కి తగ్గకూడదు.. ఇది కేవలం ఆరంభం మాత్రమే.. మా లక్ష్యం హమాస్ దళాలను నాశనం చేయడం.. మన బందీలను సురక్షితంగా తిరిగి తీసుకురావడం, వార్ క్యాబినెట్, సెక్యూరిటీ క్యాబినెట్ సమావేశంలో మేము ఏకగ్రీవంగా గ్రౌండ్ కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాం.’ అని తెలిపారు.
గాజాపై ఇజ్రాయెల్ దాడిలో మృతిచెందిన వారి సంఖ్య ఇప్పుడు 7703కు పెరిగింది, ఇప్పటివరకు 1400మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందారు. ఈ నేపథ్యంలో శత్రు భూభాగంలో మన కమాండర్లు, సైనికులను తాను కలిశానని తెలిపారు. వారు వీరోచితంగా పోరాడుతున్నారని నెతన్యాహు తెలిపారు. రాబోయేరోజుల్లో మరింత కష్టంగా ఉంటుందని, అన్నింటికీ సిద్ధంగా ఉన్నామన్నారు. ఇది తమ స్వాతంత్ర్యానికి సంబంధించిన రెండవ యుద్ధం అని అభివర్ణించారు. హమాస్ చేతిలో బందీలుగా ఉన్న 200 మంది పౌరులను రక్షించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామన్నారు.
అదేవిధంగా హమాస్ చేతిలో బందీలుగా ఉన్న పౌరుల కుటుంబాలను తాను తన భార్య సారాతో వెళ్లి కలిశానని చెప్పారు నెతన్యాహు. వారికి భరోసా కల్పించినట్లు తెలిపారు. విజయమో వీర స్వర్గమో. ఇప్పుడు మేము దానిని ఎదుర్కొంటున్నామని స్పష్టం చేశారు. అక్టోబర్ 7 దాడి సమయంలో హమాస్ ఇజ్రాయెల్, ఇతర దేశాల నుంచి పిల్లలతో సహా 200 మందికి పైగా బందీలుగా ఉన్నారు. అయితే, హమాస్ ఇప్పటివరకు నలుగురు బందీలను విడుదల చేసింది.