రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సెగ రాజుకుంటోంది. తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలై నేతలు ప్రచారాలు కూడా మొదలు పెట్టారు. మరోవైపు ఆంధ్రాలో ఈసీ ఎలక్షన్స్ కు రెడీ అవుతున్నట్టు ప్రకటించింది. అయితే ఎన్నికల సమయంలో రాజకీయ సినిమాలు (Political Movie) రావడం కామనే అయినా.. సీనియర్ ఎన్టీఆర్ (NTR) రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నుంచి ఈ ట్రెండ్ మొదలయ్యింది.
ఈమేరకు చిరంజీవి(Chiranjeevi) ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు రాజకీయ అంశాలతో ముడిపడిన సినిమాలు తెరమీదకు వచ్చాయి. వైసీపీకి అనుకూలంగా యాత్ర మూవీ వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం యాత్ర 2, వ్యూహం సినిమాలు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma) రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలకు కేరాఫ్ గా మారారు.
తాజాగా రాజకీయ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వ్యూహం (Vyuham) మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. రెండో పార్టుగా శపథం (Shapatham)మూవీ రిలీజ్ చేస్తానని కూడా వర్మ ప్రకటించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఏపీలో మరో సంచలనానికి తెర లేసింది.. జి.శివప్రసాద్ దర్శకత్వంలో అనూహ్యంగా సైకిల్ (Cycle) పేరుతో ఓ మూవీ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇది పసుపు చరిత్ర అనే ట్యాగ్ లైన్ తో సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఫొటోలతో ఈ పోస్టర్ రిలీజైంది. దీంతో ఏపీ రాజకీయాల్లో ఈ పోస్టర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ మద్దతు కోసమే ఈ సినిమా తెరపైకి వస్తుందనే ప్రచారం జరుగుతోంది.