వైసీపీ(YCP)లోకి చేరబోతున్నట్లు వస్తోన్న వార్తలను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ(JD laxminarayana) ఖండించారు. ఆ ఊహాగానాల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు. ఇటీవల శ్రీశైలం(Srishailam)లో వైసీపీ ఎమ్మెల్యే(YCP MLA) శిల్ప చక్రపాణి రెడ్డిని జేడీ లక్ష్మీనారాయణ కలిసిన విషయం తెలిసిందే. తాను చదువుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొనేందుకు లక్ష్మీనారాయణ శ్రీశైలం వెళ్లగా.. అక్కడే పర్యటిస్తున్న ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డిని కలిశారు.
పూర్వ విద్యార్థుల సమావేశానికి రావాలంటూ ఎమ్మెల్యేను సీబీఐ మాజీ జేడీ ఆహ్వానించారు. అదే సమయంలో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ప్రోగ్రాం జరుగుతుండగా అందులో పాల్గొన్న జేడీ.. సీఎం వైఎస్ జగన్ పరిపాలనపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే.. ఏపీ సీఎంను వివిధ కేసుల్లో అరెస్టు చేసిన సీబీఐ మాజీ జేడీ.. అదే జగన్ పరిపాలనను అభినందించడం పట్ల సర్వత్రా చర్చగా మారింది.
అక్కడ జేడీ ఏమన్నారంటే.. నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు చాలా అందంగా ముస్తాబయ్యాయని, అంగన్‌వాడీలలో పిల్లలకు పౌష్టికాహారం రాగిజావ ఇవ్వడంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రశంసలు కురిపించారు. జగనన్న ఆరోగ్యసురక్ష మంచి ప్రోగ్రామ్ అని కొనియాడారు. ఎవరైతే విద్యా, వైద్య రంగాలలో మంచి పనులు చేస్తారో.. వారికి అంతే స్థాయిలో ఫలితం కూడా ఉంటుందన్నారు.
జగన్ ప్రభుత్వంపై జేడీ ప్రశంసలు కురిపించడంతో ఆయన వైసీపీలో చేరతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో జేడీ లక్ష్మీనారాయణ క్లారిటీ ఇచ్చారు. ‘శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి గారిని మా పూర్వ విద్యార్థుల కార్యక్రమానికి ఆహ్వానించడానికి కలిశా. అక్కడే వైద్య పరీక్షలకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమానికి ఆయన నన్ను ఆహ్వానించారు. ఆ సమావేశంలో నేను వైద్య శిబిరాలు, నాడు-నేడు కార్యక్రమాలను అభినందించాను. అంతమాత్రాన నేను అధికార పార్టీలో చేరుతున్నట్లు కాదు’ అని జేడీ ట్వీట్ చేశారు.