బీఆర్ఎస్ నేత, మెదక్ ఎంపీ(Medak MP) కొత్త ప్రభాకర్‌రెడ్డి(Kotha Prabhakar Reddy) పై హత్నాయత్నం జరిగింది. దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని సూరంపల్లి(Surampalli) లో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి ఎంపీపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి కడుపు భాగంలో గాయమైంది.
పక్కనే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు వెంటనే ఎంపీని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై దాడి విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు హుటాహుటిన ఆసుపత్రికి బయలుదేరారు. నారాయణ్ ఖేడ్‌లో సభకు వెళ్తుండగా దాడి విషయం తెలియడంతో హరీశ్‌రావు వెంటనే ఆసుపత్రికి బయలుదేరినట్లు సమాచారం.
ఎంపీ ప్రభాకర్ రెడ్డిని ఫోన్లో పరామర్శించిన మంత్రి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ధైర్యం చెప్పారు. అత్యవసరమైతే హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి హరీష్ రావు సూచించారు. ఇదిలా ఉండగా.. ఎంపీపై కత్తితో దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకుని బీఆర్ఎస్ కార్యకర్తలు చితకబాదారు.
ఎంపీపై దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంపీపై వ్యక్తి దాడికి పాల్పడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు.