ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డిపై తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswararao) కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనపై ఉన్న అవినీతి కేసుల విచారణ నుంచి తప్పించుకుంటున్న సీఎం జగన్మోహన్రెడ్డి(CM Jaganmohan Reddy) వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్టని సెటైర్లు విసిరారు. సీఎం చెప్పింది చేస్తూ మంత్రులంతా ఆయన పెంపుడు కుక్కల కంటే దారుణంగా తయారయ్యారని ఆరోపించారు.
ఈ సందర్భంగా సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి కేసుల విచారణ నుంచి తప్పించుకుంటున్న సీఎం జగన్‌రెడ్డి (CM Jagan Reddy) వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో దిట్టని బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. వ్యవస్థల్ని గుప్పెట్లో పెట్టుకునే సొంత బాబాయ్ హత్యకేసులో శిక్ష పడకుండా అవినాశ్ రెడ్డి (Avinash Reddy), అతని తండ్రి భాస్కర్ రెడ్డి (Bhaskar Reddy)ని జగన్ కాపాడుతున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు.
చేయని తప్పుకు దళిత యువకుడు శ్రీనివాస్ కోడికత్తి కేసులో జైల్లో మగ్గిపోయేలా చేస్తోంది జగన్ రెడ్డి కాదా? అని నిలదీశారు. శ్రీనివాస్ బయటకు వస్తే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయనే ఐదేళ్లుగా జగన్ కోడికత్తి కేసులో ఎన్ఐఏ కోర్టులో విచారణకు హాజరుకావడంలేదని విమర్శించారు. అన్యాయంగా తన రాజకీయ కుట్రలకు చంద్రబాబును బలిచేసిన సీఎం జగన్, 53 రోజులుగా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఆయన జైల్లో మగ్గిపోయేలా చేస్తున్నది నిజం కాదా? అని బోండా ఉమా ప్రశ్నించారు.
చంద్రబాబు తప్పు చేశారనే ఆధారాలు ప్రభుత్వం వద్ద ఉంటే, న్యాయస్థానాల్లో కుంటిసాకులు చెబుతూ, తప్పుడు సమాచారమిస్తూ జగన్ అండ్ కో ఎందుకు తప్పించుకుంటున్నారని ఆరోపించారు. తన అన్న కాని అన్న గాలి జనార్ధన్ రెడ్డిని జైలు నుంచి విడిపించడానికి ఏకంగా న్యాయమూర్తికే లంచం ఆశచూపాడని జగన్‌పై ఫైర్ అయ్యారు. 38 కేసులున్న జగన్ పదేళ్లుగా బెయిల్‌పై బయట ఉంటూ, న్యాయస్థానాల్లో విచారణకు కూడా హాజరుకావడం లేదంటే, వ్యవస్థల్ని మేనేజ్ చేయబట్టే కాదా? అని ధ్వజమెత్తారు.
జగన్ మనస్తత్వం, దుర్మార్గం తెలిసీ.. పదవీవ్యామోహంతో, భయంతోనే మంత్రులు, వైసీపీ నేతలు వాస్తవాలు చెప్పలేని దుస్థితిలో ఉన్నారని విమర్శించారు. మంత్రులు జగన్‌రెడ్డి పెంపుడు కుక్కల కంటే దారుణంగా తయారై, టీడీపీపై.. లోకేష్‌పై నిందలు వేస్తున్నారని బోండా ఉమా మండిపడ్డారు. చేతిలో అవినీతి మీడియా, బులుగు మీడియా ఉన్నాయని జగన్ రెడ్డి, అతని మంత్రులు ఎంత బరితెగించి విషప్రచారం చేసినా చంద్రబాబుకు అవినీతి మరక అంటించలేరన్నారు. ఎప్పటికైనా న్యాయం ధర్మమే గెలుస్తాయని, జగన్ రెడ్డి.. అతని నీతి మాలిన ప్రభుత్వం చేసే దుష్ప్రచారం గెలవదని బోండా ఉమా వ్యాఖ్యానించారు.