బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి (Prabhakar Reddy) పై జరిగిన దాడి ఘటనపై గవర్నర్ తమిళిసై (Tamilisai) స్పందించారు. దీన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో ఈ దాడి జరిగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సెక్యూరిటీ విషయంలో మరిన్ని చర్యలపై ఎక్కువ దృష్టి సారించాలంటూ డీజీపీ (DGP) ని ఆదేశించారు. జరిగిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య వ్యవస్థకు సవాల్ వంటివని గవర్నర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల భద్రతపై దృష్టి సారించాలని పోలీస్ శాఖకు సూచించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలని.. ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు తమిళిసై. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరగాలంటే పోలీసు భద్రత పటిష్టంగా ఉండాలని సూచించారు.
కొత్త ప్రభాకర్ రెడ్డిపై సోమవారం ఉదయం కత్తితో దాడి జరిగింది. దాడి చేసిన వ్యక్తిని యూట్యూబర్ రాజుగా పోలీసులు గుర్తించారు. దళిత బంధు పథకానికి లబ్ధిదారుడిగా తనను ఎంపిక చేయకపోవడంతోనే ఎంపీపై కత్తితో దాడికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. దాడి చేసిన వ్యక్తిని బీఆర్ఎస్ కార్యకర్తలు చావగొట్టారు. దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
నిందితుడు రాజుది మిరుదొడ్డి మండలం చెప్పాల గ్రామం. ఇక, కొత్త ప్రభాకర్ రెడ్డిని మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు.. ఆస్పత్రికి చేరుకుని ఆయన్ను పరామర్శించారు. చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.