బీజేపీ (BJP) లో టికెట్ల పంచాయితీ కొనసాగుతోంది. తమ నాయకుడికి టికెట్ ఎందుకివ్వరంటూ కార్యకర్తలు, అభిమానులు నిరసనలకు దిగుతున్నారు. తాజాగా నర్సాపూర్ (Narsapur) అభ్యర్థి మురళి యాదవ్ కి టికెట్ ఇవ్వడంపై సొంత పార్టీ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. టికెట్ మార్చాలంటూ బీజేపీ ఆఫీస్ ముందు కార్యకర్తలు ధర్నాకు దిగారు. గోపికి కాకుండా మురళి యాదవ్ కి టికెట్ ఇవ్వడంపై మండిపడ్డారు.
నర్సాపూర్ బీజేపీని కాపాడాలి అంటూ ప్లకార్డ్స్ కూడా ప్రదర్శించారు కార్యకర్తలు. తాను 27 ఏళ్లుగా బీజేపీలోనే ఉంటున్నామని, గతంలో ఆర్ఎస్ఎస్ లోనూ పని చేశానన్నారు గోపి. భూ కబ్జాదారుడికి నర్సాపూర్ బీజేపీ టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కొంతమంది పెద్దలు కాంగ్రెస్ కి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ బీజేపీని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఎంతో బాధతోనే పార్టీ కార్యాలయం ముందు నిరసనకు దిగాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.
మరోవైపు, కూకట్ పల్లి (Kukatpalli) కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగారు. కూకట్ పల్లి సీటును జనసేనకు కేటాయించొచ్చని ప్రచారం నేపథ్యంలో అలా చేయొద్దని డిమాండ్ చేశారు. బీజేపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఇంకా సీట్లు ఖరారు కాలేదని, ఎవరూ ఆవేశపడొద్దని అక్కడున్న బీజేపీ నేతలు వారితో చెప్పారు. అయినా కార్యకర్తలు మాత్రం ఆ సీటును బీజేపీకి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. జనసేనకు ఇస్తే తాము ఊరుకోమంటూ హెచ్చరించారు.
తెలంగాణలో బీజేపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నాయి. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి. అధికారికంగా పొత్తు ఖరారు కాకపోయినా, కొన్ని చోట్ల సీట్ల విషయంలో గొడవలు మొదలయ్యాయి. ప్రముఖంగా శేరిలింగంపల్లి, కూకట్ పల్లి లాంటి బలమైన స్థానాలను జనసేనకు ఇచ్చేందుకు బీజేపీ కార్యకర్తలు ఒప్పుకోవడం లేదు. ఈమధ్య శేరిలింగంపల్లికి చెందిన బీజేపీ శ్రేణులు టికెట్ గజ్జల యోగానంద్ కు ఇవ్వాలని పార్టీ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందించారు. ఇప్పుడు కూకట్ పల్లికి చెందిన పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు.