టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీపై మంత్రి కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి (Kishan Reddy) తీవ్రంగా మండిపడ్డారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు కేటీఆర్ మాటలు ఉన్నాయని ఆయన ఫైర్ అయ్యారు. మార్చిలో కుంభకోణం వెలుగు చూస్తే ఇప్పటి వరకు ఎందుకు మన్ను తిన్న పాములాగా ఉన్నారంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
పేపర్ లీకేజీ జరిగిన సమయంలో టీఎస్పీఎస్సీని ఎందుకు ప్రక్షాళన చేయలేదని ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రక్షాళన చేస్తామనటం హాస్యాస్పదమని చెప్పారు. లీకేజీ జరిగినప్పుడు తనకేమి సంబంధమని కేటీఆర్ వితండ వాదం చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినట్లు కేటీఆర్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల తర్వాత సీఎం అయినట్లు కేటీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబం ఫాంహౌస్‌కు పరిమితం కావటం ఖాయమని వెల్లడించారు. యువతపై నిజంగా కేసీఆర్ కు ప్రేమ ఉంటే ఎప్పుడో ఉద్యోగాలను భర్తీ చేసేవారని అన్నారు. కేసీఆర్ సర్కార్ వల్లే 30 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆరోపించారు.
వరంగల్ విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్య పాపం కేసీఆర్, బీఆర్ఎస్ సర్కార్ దేనని ఆరోపణలు గుప్పించారు. వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ప్రవళిక అత్యహత్యను రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవటం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. కేసీఆర్ పాలనలో టీఎస్పీఎస్సీ పరీక్షలు 17 సార్లు వాయిదా పడ్డాయని వివరించారు. పరీక్షల వాయిదాలో కేసీఆర్ సర్కార్ గిన్నీస్ రికార్డు సృష్టించిందన్నారు.
టికెట్ల కేటాయింపుల విషయంలో పార్టీదే తుది నిర్ణయమని చెప్పారు. నవంబర్ ఒకటిన పార్టీ అధ్యక్షుడితో చర్చించి మూడో లిస్టుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజాస్వామిక పద్ధతిలోనే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కుటుంబపార్టీ అని ఫైర్ అయ్యారు. తమది అలాంటి పార్టీ కాదన్నారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ఏ అభ్యర్థిపైనా దాడి జరగడం మంచి పద్ధతి కాదన్నారు.