మెదక్ (Medak) ఎంపీ (MP) కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy)పై జరిగిన హత్యాయత్నం రాజకీయంగా సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ ఘటన పై మంత్రి హరీష్ రావు (Harish Rao) సీఎం కేసీఆర్ (CM KCR) టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు. పలు విమర్శలు గుప్పించారు.
మరోవైపు హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి ఆపరేషన్ పూర్తైంది. కాసేపట్లో వైద్యులు ఆయనను ఐసీయూలోకి మార్చనున్నట్టు సమాచారం. కత్తిపోటు కారణంగా పేగుకు గాయం కావడంతో ఇన్‌ఫెక్షన్ సోకకుండా సర్జరీ చేసినట్టు వైద్యులు తెలిపారు. కాగా కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడి ఘటనలో ఆయన చిన్న ప్రేగుకు 4 చోట్ల గాయాలు అయ్యాయని, అందువల్ల 15 సెంటీమీటర్ల వరకు కడుపును కట్ చేసి10 సెంటీమీటర్ల వరకు చిన్న ప్రేగును తొలగించినట్టు యశోద వైద్యులు తెలిపారు..
కడుపులో రక్తం పేరుకుపోవడం వల్ల 15 సెంటీమీటర్ల వరకు కట్ చేసి రక్తం క్లిన్ చేశామని వైద్యులు అన్నారు. ఇదిలా ఉండగా కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితునిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభాకర్ రెడ్డిపై మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల గ్రామానికి చెందిన గడ్డం రాజు (38) అనే వ్యక్తి కత్తితో దాడి చేసినట్టు కమిషనర్ వెల్లడించారు. దాడికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు..