బీఆర్ఎస్ ఎంపీ, ఆ పార్టీ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhkar Reddy) పై జరిగిన దాడిపై ఎమ్మెల్యే రఘు నందన్ రావు (MLA Raghunandan Rao) స్పందించారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి దురదృష్టకరమని చెప్పారు. దాడికి పాల్పడిన వ్యక్తి ఓ ఛానల్ రిపోర్టర్ అని ఓ వెబ్ సైట్ ద్వారా తెలుస్తోందన్నారు. దళిత బంధు అందలేదనే ఆవేదనతోనే ఆ వ్యక్తి దాడి చేసినట్టు మీడియాలో వార్తలు వచ్చాయన్నారు.
కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడికి తానే కారణమంటూ ప్రచారం జరుగుతోందని, అందులో వాస్తవం లేదన్నారు. ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అనవసరంగా తనపై బురదజల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ నేతలతో నిందితుడు కలిసి దిగిన ఫోటోలు ఫేస్ బుక్ పేజీలో వున్నాయని చెప్పారు.
నిందితుడు ఏ పార్టీకి చెందిన వ్యక్తి అనే విషయాన్ని సీపీ స్పష్టంగా చెప్పి వుంటే బాగుండేదని ఆయన అన్నారు. తప్పు చేసిన వాళ్లు తమ పార్టీ కార్యకర్తలైతే తానే తీసుకొచ్చి పోలీసులకు అప్పగిస్తానన్నారు. దళితబంధు రాలేదనే ఆవేదనతోనే ఆ వ్యక్తి దాడి చేసినట్టు మీడియాలో వార్తలు వచ్చాయన్నారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయాలు బయటకు వస్తాయన్నారు.
కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని పేర్కొన్నారు. దాడి తర్వాత బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దిపాయన్ పల్లికి చెందిన కార్యకర్త స్వామిని పోలీసులు మఫ్టీలో ఎత్తుకెళ్లారని ఆరోపించారు.
దుబ్బాక బీజేపీ కార్యాలయంపై కొంత మంది దాడి చేశారని ఆయన ఆరోపించారు. తమ సిబ్బందిపై పలువురు కౌన్సిలర్లు దాడి చేశారని అన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అమలులో ఉందని, తన దిష్టి బొమ్మను దగ్దం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.