ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) పై హత్యాయత్నం కేసు చుట్టూ మాటల యుద్ధం కొనసాగుతోంది. నిందితుడు ఎవరి కోసం ఇదంతా చేశాడు? అనే చర్చ జరుగుతుండగా.. కొన్ని ఫోటోలు బయటకొచ్చాయి. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ (KTR).. కాంగ్రెస్ (Congress) ను టార్గెట్ చేశారు.
ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం కాంగ్రెస్ గూండా పనేనని ఆరోపించారు. మంగళవారం ట్విట్టర్ (ఎక్స్) లో నిందితుడు గట్టని రాజు (Raju) కాంగ్రెస్ కండువాతో ఉన్న ఫోటోను షేర్ చేశారు కేటీఆర్. ఇతను కాంగ్రెస్ వ్యక్తే అనడానికి ఇంతకంటే రుజువు కావాలా అని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ని ప్రశ్నించారు.
ఇక, యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రభాకర్ రెడ్డిని కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇటు, నిందితుడు ఎందుకు హత్యాయత్నానికి పాల్పడ్డాడు అనేదానిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యాయత్నం పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందా? నిందితుడు ఎంపీ పర్యటన వివరాలు తెలుసుకుని మాటు వేసి కత్తితో దాడి చేశాడా? బీఆర్ఎస్ నాయకులను రాజు ఎంపీ ప్రచార షెడ్యూల్ ఎందుకు అడిగాడు? మూడు రోజులుగా ఎందుకు ఫాలో అవుతున్నాడు? ఈ దాడి వ్యక్తిగత గొడవలా? లేదా రాజకీయ కుట్ర కోణం ఉందా? ఇలా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.