స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత చంద్రబాబుకు (Chandrababu) మధ్యంతర బెయిల్ మంజూరైంది. నాలుగు వారాల పాటు ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలరీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు.. తీర్పును రిజర్వు చేసింది. ఈ మేరకు నేడు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పు వెల్లడించారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాల రీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని అనుబంధ పిటిషన్ వేశారు. అయితే చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.
చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని.. కంటికి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తాజాగా చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు నవంబర్ 10వ తేదీన రెగ్యులర్ బెయిల్‌పై హైకోర్టు విచారణ జరగనుంది. నవంబర్ 10వ తేదీన రెగ్యులర్ బెయిల్‌పై హైకోర్టు విచారణ జరగనుంది.
సెప్టెంబర్ 9న నంద్యాలలో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనికు రిమాండ్ విధించడంతో చంద్రబాబును రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. అప్పటి నుంచి 52 రోజులుగా జైల్లోనే ఉన్నారు చంద్రబాబు. తాజాగా చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన సాయంత్రం విడుదలయ్యే అవకాశముంది.
చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ శ్రేణులతో పాటు ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి నారా లోకేశ్, బ్రాహ్మణి చేరుకున్నారు. ఏ తప్పూ చేయని చంద్రబాబును అన్యాయంగా 52రోజులు జైల్లో పెట్టారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. బాబుకు బెయిల్ మంజూరు చేయడాన్ని స్వాగతిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే వైసీపీ సమాధి కావడం ఖాయమని తెలిపారు.
అయితే, చంద్రబాబుకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అవేంటంటే.. రూ.లక్ష విలువైన బెయిల్ బాండ్ (పూచీకత్తు)తో పాటు రెండు ష్యూరిటీలు సమర్పించాలి. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ కేసును ప్రభావితం చేసే చర్యలు చేపట్టరాదు. సాక్షులను, కేసుకు సంబంధించిన వ్యక్తులను ప్రభావితం చేయొద్దు. నచ్చిన ఆసుపత్రిలో సొంత ఖర్చులో చంద్రబాబు చికిత్స చేయించుకోవచ్చు. బెయిల్ ముగిసిన తర్వాత సరెండర్ సమయంలో ఆసుపత్రి, చికిత్స వివరాలను సీల్డ్ కవర్లో జైలు సూపరింటెండెంట్‌కు అందించాలి. నవంబర్ 28న సాయంత్రం 5గంటల లోపు సరెండర్ అవ్వాలి.