అధికార పార్టీ నాయకుడిపై దాడి జరిగితే.. కోడి కత్తి అంటూ ప్రతిపక్షాలు అపహాస్యం చేస్తూ మాట్లాడుతున్నాయని మంత్రి హరీశ్‌రావు(Harishrao) మండిపడ్డారు. కత్తి దాడితో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి(Yashoda Hospital)లో చికిత్స పొందుతున్న మెదక్ ఎంపీ (Medak mp), దుబ్బాక నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి(Kotha Prabhakar Reddy)ని మంత్రి హరీశ్‌రావు నేడు మరోసారి పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకులతో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం కాస్త నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు హరీశ్‌రావు. ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఓ ప్రజాప్రతినిధిపై కత్తితో దాడి చేస్తే కోడి కత్తి అంటూ ప్రతిపక్ష నేతలు అపహాస్యం చేస్తున్నారని మంత్రి సీరియస్ అయ్యారు. ఈ ఘటనను ఖండించాల్సిన ప్రతిపక్షాలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాయని.. సీనియర్ నాయకులూ చిల్లర కామెంట్స్ చేస్తున్నారని తీవ్రంగా ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి అలాంటి డ్రామాలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఒక ప్రజాప్రతినిధి కడుపులో చిన్న పేగుకు నాలుగు చోట్ల రంధ్రాలు పడి, ఇంత చిల్లర మాటలు మాట్లాడతారా? అంటూ ధ్వజమెత్తారు. ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారని మంత్రి తెలిపారు. నిందితుడి కాల్ డేటా సేకరించారని.. వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అన్నారు. ఒకట్రెండు రోజుల్లో కుట్ర కోణాన్ని ఛేదిస్తారని ఆశిస్తున్నట్లు హరీశ్ రావు వెల్లడించారు.
తెలంగాణలో ఇలాంటి నీచ రాజకీయాలు ఎన్నడూ చూడలేదన్న మంత్రి.. ఇన్నేళ్ల చరిత్రలో ఎన్నికల సమయంలో ఇలా దాడులు జరగడం చూడలేదని వెల్లడించారు. పని తనం తప్ప పగతనం లేని నాయకుడు కేసీఆర్ అని.. అలా పగ ఉంటే ఇప్పటికే ఎంతో మంది జైళ్లలో ఉండేవారని చెప్పారు. మరోవైపు.. యశోద వైద్యులు ప్రభాకర్‌రెడ్డి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పలేమని అన్నారు. ఎంపీకి ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్నాయని.. ఐదు రోజుల పాటు ఐసీయూలో చికిత్స అందిస్తామని తెలిపారు.