‘రాష్ట్ర’ చెప్పిందే నిజమైంది. వివేక్ వెంకటస్వామి (Vivek Venkata Swamy) పార్టీ మార్పు విషయంలో.. బీజేపీ (BJP) నేతలు ఎన్నిసార్లు ఖండించినా ఆయన తీరు డౌట్ గానే ఉందని చెప్పింది ‘రాష్ట్ర’. ఇప్పుడు అదే జరిగింది. బీజేపీకి గుడ్ బై చెప్పారు వివేక్.
ఇటీవల మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. తాజాగా వివేక్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు.
ఈమధ్య రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు వివేక్. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరడం ఖాయం అని వార్తలు వచ్చాయి. కానీ, బీజేపీ నేతలు దీన్ని ఖండించారు. మంగళవారం కూడా ఎంపీ లక్ష్మణ్ ఆరు నెలలుగా వివేక్ పై అనేక వదంతులు వస్తున్నాయన్నారు. కానీ, 24 గంటలు గడవక ముందే వివేక్ బీజేపీని వీడారు.
తన కుమారుడి కోసమే వివేక్ బీజేపీకి రాజీనామా చేసినట్లు సమాచారం. ఆయన కుమారుడు వంశీకి కాంగ్రెస్ పార్టీ చెన్నూరు అసెంబ్లీ టికెట్ ఆఫర్ చేసినట్లు తెలిసింది. ఈ సీటును పొత్తులో భాగంగా సీపీఎంకు కేటాయిస్తారని ప్రచారం జరగ్గా.. కమ్యూనిస్టులతో పొత్తు తేలకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.