– శేరిలింగంపల్లి సీట్ జనసేనకేనా?
– కీలక నేత బరిలోకి దిగుతున్నారా?
– బీజేపీ గజ్జల యోగానంద్ సంగతేంటి..?
– మూడో లిస్టులోనూ లేని పేరు
– యోగానంద్ కు లోక్ సభ సీటును ఖాయం చేస్తున్నారా?
– రాజకీయ పండితుల విశ్లేషణ
తెలంగాణ బీజేపీలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. 35 మందితోనే మూడో లిస్ట్ ను వదిలింది హైకమాండ్. దీంతో ఇప్పటిదాకా 88 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. 31 సీట్లను పెండింగ్ లో పెట్టింది. వాటిలో శేరిలింగంపల్లి కూడా ఒకటి. ఐటీ కారిడార్ తో ఉన్న ఈ నియోజకవర్గం అందరికీ ఫేవరెట్. ప్రస్తుతం బీజేపీ, జనసేన మధ్య పొత్తు చర్చలు జరుగుతున్నాయి. సీట్ల సర్దుబాటు అంశం తెగడం లేదు. అయితే.. శేరిలింగంపల్లి నుంచి జనసేన పోటీ చేయడం ఖాయమనే చర్చ జోరుగా జరుగుతోంది. అదికూడా, జనసేనలోని అగ్ర నాయకుడు రంగంలోకి దిగనున్నారని రాజకీయ వర్గాల్లో తెగ మాట్లాడుకుంటున్నారు.
కీలకమైన శేరిలింగంపల్లిని బీజేపీ వదులుకుంటోందని.. దీని వెనుక ఆంతర్యం ఏంటో అర్థం కావడం లేదని అంటున్నారు. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో బీజేపీ బలోపేతం కోసం గజ్జల యోగానంద్ శ్రమిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయనే పోటీ చేశారు. అప్పటి నుంచి వాడవాడకు బీజేపీని తీసుకెళ్తున్నారు. మరి, అలాంటి లీడర్ ను కాదని.. అసలు, బీజేపీకే కాకుండా జనసేనకు శేరిలింగంపల్లిని ఇస్తున్నారని జరుగుతున్న ప్రచారం పార్టీ కార్యకర్తల్లో అసహనానికి కారణమౌతోందని అంటున్నారు రాజకీయ పండితులు.
ఇదే సమయంలో గజ్జల యోగానంద్ ను లోక్ సభకు పంపే ఉద్దేశంతో బీజేపీ ఇలా అడుగులు వేస్తోందనే ప్రచారం జరుగుతోంది. నాలుగో లిస్ట్ వస్తేనే అన్ని ప్రశ్నలకు సమాధానాలు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు.